BRS | హుజురాబాద్, : ఏప్రిల్ 27 : బీఆర్ఎస్ రజతోత్సవ సభ కాంగ్రెస్ పతనానికి నాంది అని 30 వ వార్డు బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు తెలిపారు. హుజురాబాద్ పట్టణంలోని 30 వ వార్డు (విద్యానగర్) లో బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు కేసరి మధుకర్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ జెండాను ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతో ప్రజలను నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామన్నారు. కానీ 16 నెలలు గడిచినా ఒక్క హామీ పూర్తిగా అమలవలేదని మండిపడ్డారు. మహిళలకు నెలకు రూ.2500, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్లు, ఈ హామీలు ఇంకా నెరవేరలేదని, ప్రభుత్వ హామీలను నెరవేర్చే వరకు పోరాడుతామని, రైతులకు న్యాయం జరగట్లేదని, రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా, 24 గంటల కరెంట్ వంటి అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేస్తోందన్నారు. కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడిన రైతులను ఈ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబతారని, మళ్లీ బీఆర్ఎస్ అధికారం చేజిక్కించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎర్ర రాజ్ కుమార్, ఎర్ర సంపత్, దిల్ శ్రీనివాస్, పూసల శేషాద్రి రెడ్డి, అలాగే వార్డు ప్రముఖులు దాస్యం రామస్వామి, రామారపు రాజశేఖర్, మంతెన రమేష్, నార్లగిరి గణేష్, మహమ్మద్ సర్దార్, మహ్మద్ హుస్సేన్, రావుల వేణు, గుజ్జేటి రమేష్, కిషోర్, తుపుకారి శ్రీనివాస్, పున్నం నర్సయ్య, కుడికాల చందు, తిరుమలేష్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.