mlc kalvakuntla kavitha | పెద్దపల్లి, ఏప్రిల్ 23( నమస్తే తెలంగాణ): కుంభమేళా తరహాలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ నిర్వహించనుందని, ఇది యావద్ దేశంలోనే చారిత్రాత్మకం కానున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బ్యారేజ్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆమె బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెద్దపల్లి జిల్లా ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేసిందని, బొగ్గు గనులకు కేంద్రం పెద్దపల్లి జిల్లా అని అన్నారు.
ఉద్యమ సమయంలో సింగరేణి సమ్మె చేస్తే… తట్టా చెమ్మస్ కింద పడేస్తేనే డిల్లీకి ఉద్యమ సెగ తగిలిందన్నారు. 25 ఏండ్లుగా నిలబడ్డ ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ప్రతీఒక్కరితో, తెలంగాణలోని ప్రతీ ఇంటితో, ప్రతీ పల్లెతో బీఆర్ఎస్ పార్టీ పెనవేసుకుందన్నారు. ఒకప్పుడు అవహేళన చేసిన వాళ్లకు రక్షగా గులాబీ జెండా ఉందని, పదేళ్లలో తెలంగాణను దేశానికే నెంబర్ వన్ గా నిలిపించి గులాబీ జెండా ఎగిరిందన్నారు. 25 ఏండ్ల చరిత్రను నేడు యావత్ తెలంగాణ గుర్తుచేసుకుంటున్నదన్నారు. ఏడాది పాటు బీఆర్ఎస్ పార్టీ వేడుకలు చేస్తామని వివరించారు. దేశ రాష్ట్ర చరిత్రలోనే కుంభమేళా తరహాలో నిర్వహించాలన్న ఈ రజతోత్సవ సభకు పెద్దపల్లి జిల్లా నుండి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు
రైతుల సమస్యలపై మంత్రి శ్రీధర్ బాబు ఎందుకు మాట్లడడం లేదు
వడగళ్ల వానలు వస్తే.. బీఆర్ఎస్ మంత్రులు ఆయా ప్రాంతాలను సందర్శించి పంటలను పరిశీలించే వారని, ఇక్కడి పరిస్థితులను కేంద్రానికి వివరించి పెద్ద ఎత్తున పరిహారాన్ని అందించే వారమని గుర్తు చేశారు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో అలా లేదని, రైతులకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు .ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని వివరించారు. పెద్దపల్లి కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలన్నారు. రైతుబంధు ఎగ్గొట్టి రైతుకు భరోసా లేకుండా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. వ్యవసాయం చేయాలంటే రైతులు భయపడే స్థితికి తెచ్చారని, కాంగ్రెస్ పార్టీ పాలలో ప్రజలు నాన్న దండాలు పడుతున్నారని గుర్తు చేశారు. రైతుల సమస్యల పై ఈ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయంలో అకాల వర్షాలు పడితే క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపరిహారం ఇచ్చామని, కాంగ్రెస్ పార్టీ ఎందుకు రైతులను పట్టించుకోదన్నారు.
గ్రూపు-1 రద్దు చేయాలి
గ్రూపు- 1 పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేసీఆర్ జీఓ 55 తెచ్చి యువతకు నిరుద్యోగులకు మేలు చేస్తే, కాంగ్రెస్ జీవో 29 తెచ్చి యువకుల పొట్టకొడుతున్నారని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం రూ.ఐదు లక్షల చొప్పున వడ్డీ లేదని, రుణాలను అందిస్తే రూ.20 లక్షల చొప్పున రుణాలను ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. జిల్లాలోని మహిళా సంఘాలన్నింటికీ కలిపి ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం, అలా చేయడం వల్ల మహిళలకు ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా అండదనే విషయాన్ని గుర్తేరగాలన్నారు.
రాష్ట్రంలో ఒక్క నిజాన్ని కూడా చెప్పని ముఖ్యమంత్రి, మంత్రులు ఉండడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటివరకు జై తెలంగాణ.. అనని ముఖ్యమంత్రి మంత్రులు పాలన సాగించడం మన దురదృష్టకరమన్నారు. గురుకులాలను నాశనం చేసి విద్యార్థులను పొట్ట కొడుతున్నారని, బీఆర్ఎస్ సర్కార్ హయాంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కితే.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నేడు 100 మందికి పైగా పసి పిల్లలు పాడేనెక్కారన్నారు. రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపిస్తున్నారు. సింగరేణి ప్రైవేటీకరణ అడ్డుకుంది కేసీఆర్ అన్నారు. అదే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సింగరేణి ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు.
లాభాల వాటాలో సగం డబ్బుకు ఇచ్చి కార్మికులను మోసం చేసింది కాంగ్రెస్ అని అన్నారు. 8+8 ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి ఒక్క రూపాయి రాలేదని, కాంగ్రెస్, బీజేపీ రెండు ఒక్కటే అన్నారు. వచ్చే ఎన్నిక ఏదైనా బీఆర్ఎస్ దే విజయమని, రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నిక ఏదైనా ఆ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధుకర్, దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నాగదాసు లక్ష్మణరావు, రాష్ట్ర వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు చిరుమిళ్ల రాకేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, నాయకులు కౌశిక్ హరి, దాసరి ఉష, గంట రాములు, బండారి శ్రీనివాస్, ఉప్పు రాజ్ కుమార్, బాలాజీ రావు, పసుల చరణ్, పెంట రాజేష్, తగరం శంకర్ లాల్, బొడ్డు రవీందర్, సంధ్యారెడ్డి, నారాయణదాసు మారుతిలతోపాటు పలువురు ఉన్నారు.