కాంగ్రెస్ కుట్రలపై ఆగ్రహం పెల్లుబికింది. ఊరూరా ఉవ్వెత్తున ఎగిసిపడింది. రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసును ముడిపెట్టి, చట్టవిరుద్ధంగా సిట్ విచారణ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. అభివృద్ధి ప్రదాత కేసీఆర్‌ను రేవంత్ సర్కారు వేధింపులకు గురిచేయడాన్ని తీవ్ర స్థాయిలో ఖండించాయి. ఆదివారం అన్ని వర్గాలతో కలిసి గ్రామగ్రామానా శాంతియుతంగా నిరసనలు తెలిపాయి. పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు సైతం పాల్గొనగా, మరింత ఉత్సాహంగా కదం తొక్కాయి. రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేసి, సర్కారుకు వ్యతిరేకంగా నినదించాయి. భారీ ర్యాలీలు తీసి, రాస్తారోకోలు, ధర్నాలతో రహదారులను దిగ్బంధించాయి. నాటి తెలంగాణ ఉద్యమ సందర్భాన్ని గుర్తు చేశాయి. ఆయాచోట్ల నాయకులు కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగట్టారు. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగడం లేదని, ప్రతీకార పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. మచ్చలేని నాయకుడు కేసీఆర్‌ను వేధించాలని చూస్తే కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఇకనైనా ఇలాంటి కక్షసాధింపు చర్యలు మానుకోవాలని హితవుపలికారు.
కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతోపాటు శ్రేణులతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి, రాస్తారోకో చేశారు. హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ తీశారు. మానకొండూర్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్ ధర్నా చేశారు. చొప్పదండి మండలం కొలిమికుంటలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, నాయకులు కలిసి 500 బైకులతో ర్యాలీ తీశారు. శాతవాహన యూనివర్సిటీ ముందు బీఆర్ఎస్వీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

Karimnagar
అప్రతిష్టపాలు చేసే కుట్ర
కాంగ్రెస్ చేస్తున్న అవినీతి, అక్రమాలను బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తున్నది. అందుకే కక్షకట్టి డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నది. ఇప్పుడు కేసీఆర్‌ను అప్రతిష్ట పాలు చేయాలని రేవంత్ కుట్ర చేస్తున్నరు. ప్రజలను తప్పుదారి పట్టించి లబ్ధి పొందాలని చూస్తున్నరు. అందులో భాగంగానే సిట్ నోటీసులు ఇప్పించిన్రు. రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం అంటేనే తెలంగాణ సమాజాన్ని అవమానించినట్టే. రేవంత్‌రెడ్డికి ప్రజల చేతిలో శిక్ష తప్పదు.
– కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్
రాజకీయ కక్షతోనే..
రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ తెలంగాణ బాపూజీగా ప్రజల గుండెల్లో నిలిచిండు. రాష్ట్ర సాధన కోసం ఆయన జీవితాన్నే అంకితం చేసిండు. సాధించిన రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిండు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిపై కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నది. రాజకీయ కక్షతో ఆధారం లేని కేసులో చట్టవిరుద్ధంగా సిట్ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తుండడం సరికాదు. ఇది హేయమైన చర్య. కేసీఆర్ మచ్చలేని నాయకుడు. ప్రజలే ఆయనకు అండగా నిలుస్తరు.
– హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

ఉద్యమకారుల్ని అవమానించడమే
రేవంత్ కక్షపూరిత రాజకీయాలు చేయడం సరికాదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులివ్వడం దుర్మార్గమైన చర్య. ఆయనను విచారణకు పిలువడం అంటే తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని, తెలంగాణ సమాజాన్ని, ఉద్యమకారుల్ని అవమానించినట్లే. దీనిని తెలంగాణ ప్రజలు సహించరు. ఇప్పుడు అక్రమ విచారణను వ్యతిరేకిస్తూ కేవలం రేవంత్ దిష్టిబొమ్మలను మాత్రమే బీఆర్ఎస్ శ్రేణులు తగులబెట్టనయి. కానీ, రేవంత్ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయక పోతే రేపు ప్రజలు కాంగ్రెస్‌ను తగులపెట్టే రోజులు వస్తయి. ఇప్పటికైనా రేవంత్ తన వైఖరి మార్చుకోవాలి.
-మానకొండూర్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
రాష్ట్రంలో తుపాకీ రాముడి పాలన
కేసీఆర్ చావు నోట్లో తలబెట్టి మరీ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిండు. సీఎంగా బాధ్యతలు చేపట్టి అన్ని రంగాల్లో తీర్చిదిద్దిండు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఈ రెండున్నరేండ్లలో చేసిందేమీ లేదు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు లొట్టపీసు కేసులు పెడుతూ బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులు పెడుతున్నది. అగ్ర నేతలకు నోటీసులు పంపిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నది. రాష్ట్రంలో తుగ్లక్, తుపాకీ రాముడి పాలన నడుస్తున్నది. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు. కచ్చితంగా గుణపాఠం చెబుతరు.
– కొలిమికుంటలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే..
రెండేళ్ల పాలనలో బయట పడుతున్న అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే కాంగ్రెస్ సిట్ నోటీసుల పేరిట వేధిస్తున్నది. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడం సరికాదు. ప్రభుత్వంలో మంత్రులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయరు. పోలీసులు శాంతి భద్రతల కోసం ట్యాపింగ్ చేస్తరు. తప్పుడు కేసులతో బీఆర్ఎస్ను భయపెట్టలేరు. కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు గులాబీదళం భయపడదు. ప్రజలు రేవంత్‌కు తగినబుద్ధి చెబుతరు.
– కరీంనగర్లో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు





