రాజన్న సిరిసిల్ల, మార్చి 7 (నమస్తే తెలంగాణ) సిరిసిల్ల, సిరిసిల్ల టౌన్: అధికారం పోయి కాంగ్రెస్ పార్టీ రావడంతో కొంత నిర్లప్తంగా ఉన్న కార్యకర్తల్లో రామన్న తన స్పీచ్‌తో ఒక్కసారిగా జోష్ పెంచారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా..? మీవెంటే ఉంటూ.. మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానంటూ కార్యకర్తలకు భరోసానిచ్చారు. గురువారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అధ్యక్షతన జరిగిన సిరిసిల్ల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై విఫలం అవుతుందని, పార్లమెంట్ ఎన్నికల్లో సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమంటూ చేసిన ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో వినోదన్నను గెలిపించుకుంటామని నినాదాలు చేశారు. ఈ సమావేశంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వైస్‌చైర్మన్ మంచె శ్రీనివాస్, మాజీ చైర్పర్సన్ గుడ్ల మంజుల, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, గూడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, మ్యాన రవి, గాజుల బాలయ్య, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం సమావేశం అనంతరం గీతానగర్‌లోని సయ్యద్ షావలి బాబా దర్గాలో నిర్వహించిన ఉర్స్ ఉత్సవాలకు మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు.