పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పావులు కదుపుతున్నారు. అందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఈ నెల 24న ఉమ్మడి జిల్లా సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్‌ను నిర్వహించిన ఆయన, నేడు సిరిసిల్ల నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఉమ్మడి జిల్లాలో సిరిసిల్లతో మొదలయ్యే ఈ సమావేశాలు.. అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఇతర పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ.. వాస్తవాలను ప్రజలకు తెలుపడంతో పాటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్
దిశానిర్దేశం చేయనున్నారు.
కరీంనగర్, జనవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ రాజన్న సిరిసిల్ల (నమస్తే తెలంగాణ) : లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్, అందుకు కసరత్తు ప్రారంభించింది. కేత్రస్థాయిలో ఉన్న పార్టీ నాయకులను, కార్యకర్తలను కార్మోన్ముఖులను చేసేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో ఓట మి పొందిన ఆ పార్టీ.. అందుకు కారణాలను ఇప్పటికే అన్వేషించింది.
తిరిగి ఆ పొరపాట్లు లోక్‌సభ ఎన్నికల్లో పునరావృతం కాకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నది. అసెం బ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తల సలహాలు, సూచనలను స్వీకరించే లక్ష్యంతో శనివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నది.
అత్యధిక సభ్యత్వాలతో బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలోనే ఏకైక పార్టీగా ఎదిగింది. ఒక్క సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గాన్ని తీసుకుంటే.. గులాబీ పార్టీకి 1,03,075 మంది సభ్యత్వం ఉన్నది. 2021లో సభ్య త్వ కార్యక్రమం నిర్వహించినప్పుడు సిరిసిల్ల నియోజకవర్గం రాష్ట్రంలోనే ప్రథమ స్థాయిలో నిలిచింది. ఆనాటి లెక్కల ప్రకా రం చూస్తే.. సిరిసిల్ల టౌన్లో 36,275, ఎల్లారెడ్డిపేటలో 19,700, ముస్తాబాద్‌లో 14,950, గంభీరావుపేటలో 13,775, తంగళ్లపల్లిలో 13,750, వీర్నపల్లిలో 4,62 5 కలుపుకొని చూస్తే మొత్తం 1,03,075 మంది సభ్యత్వ సేకరణ జరిగింది.
సిరిసిల్ల నియోజకవర్గ చరిత్రలోనే ఇంత సభ్యత్వమున్న పార్టీ ఇంకోటి లేదు. భవిష్యత్‌లోనూ ఉండే దాఖలాలు లేవు. అలాగే, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చూస్తే 13 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏడు లక్షల వరకు సభ్యత్వాలతో రికార్డు సృష్టించింది. గ్రామగ్రామాన పార్టీ బలంగా ఉన్నా.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీలు చేసిన అసత్య ప్రచారాలను తిప్పికొట్టే విషయంలో పార్టీ శ్రేణులు కొంత వెనుకబడిపోయాయి.
దీంతో సోషల్ మీడియా వేదికగా విష ప్రచారాలతో ప్రజలను పక్కదారి పట్టించడంలో ఇతర పార్టీలు కొంత విజయం సాధించాయన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మెజార్టీ సీట్లను స్పల్ప తేడాతో కోల్పోయింది. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు ముందు నుంచే శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు సిద్ధమైంది. నిజానికి ఏ పార్టీకి లేనంత బలం బీఆర్ఎస్కు ఉండగా, కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేస్తే లోకసభఎన్నికల్లో విజయం తథ్యం అవుతుందన్న అభిప్రాయాలున్నాయి.
నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం కన్నా.. బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేయడానికి ఎక్కువ సమ యం కేటాయిస్తున్నది. క్షేత్రస్థాయిలో వివిధ వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఆ దిశగా దృష్టి పెట్టడం లేదని తెలుస్తున్నది. గత పదేళ్ల కేసీఆర్ సర్కారు పాలనలో మొగులు మొఖం చూడాల్సిన పరిస్థితి లేదు. కానీ, కాంగ్రెస్ వచ్చిన కొద్ది రోజుల్లోనే సాగునీటి కొరత ఏర్పడింది. ఇప్పటికే ఎస్సారెస్పీ చివరి కాలువలకు నీరందడం లేదు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందలాది ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోతున్నాయి.
కొన్నిచోట్ల పొలాలు నెర్రెలు వారుతున్నాయి. చాలా ప్రాంతాల్లో నాట్లు వేయక నారు ముదిరిపోతున్నది. గంగాధర మండలంలో కొంతమంది తమ వరి పంటను కాపాడుకునేందుకు మళ్లీ బావులు తవ్వుతున్నారు. కేసీఆర్ సర్కారు పాలనలో వ్యవసాయ బావుల వద్ద క్రేన్లు కనిపించలేదు కానీ, ఇప్పుడు మళ్లీ బావులు తవ్వుకునే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇదే కాకుండా.. ఇప్పటికే ఎల్ఎండీ దిగువన వారబందీ అమలు చేస్తున్నారు. కానీ, గొప్పలు చెప్పుకోవడానికి కాకతీయ కెనాల్ ద్వారా నల్గొండ వరకు నీళ్లు ఇస్తున్నట్టు లెక్కలు చూపుతున్నారు.
కరెంటు విషయంలో విచ్చలవిడిగా ట్రిప్ అవుతున్నది. రైతుభరోసా కింద నేటికీ రైతు ల ఖాతాల్లో డబ్బులు వేయలేదు. అడిగితే చెప్పుతో కొట్టాలంటూ కాంగ్రెస్ నాయకులు దురుసుగా మాట్లాడుతున్నారు. అలాగే, అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఆ దిశగా ఆలోచన లేదు. అభయహస్తం గ్యారెంటీల అమలులోనూ అదే పరిస్థితి ఉంది. తెల్ల రేషన్‌కార్డులకు దరఖాస్తులు తీసుకున్నా కంప్యూటీరీకరణ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూణ్ణాళ్లకే సాంచాలు మూత పడ్డాయి. కేటీఆర్ డిమాం డ్ మేరకు తిరిగి ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడంతో మళ్లీ సాంచాలు మొదలయ్యాయి. ఇలా లోతుగా చూస్తే అనేక లొసుగులు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను చూస్తే 420 హామీలున్నాయి. హామీలు ఇచ్చినంత శ్రద్ధగా.. వాటిని అమ లు చేసే విషయంలో మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఇవిపోగా.. తిరి గి గత కేసీఆర్ సర్కారును విమర్శించడమే పనిగా కాంగ్రెస్ ముం దుకుసాగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన నిలబడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగుతూ.. వాస్తవాలను ప్రజల ముం దుంచుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహిస్తున్నది. అందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గదర్శనంలో శ్రేణులను తీర్చిదిద్దుతున్నది.
లోక్‌సభ ఎన్నికలకు గులాబీ సైన్యాన్ని సన్నద్ధం చేసే లక్ష్యంతో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యా ప్తంగా అసెంబ్లీ నియోజకవర్గస్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలను శనివారం నుంచే ప్రారంభించింది. ఆదివారం సిరిసిల్లలో నిర్వహించనుండగా, అందుకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్ వద్ద భారీ ఏ ర్పాట్లు చేస్తున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై, గులాబీ సైన్యానికి దిశానిర్దేశం చేయనున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సమావేశంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ దేశ్‌పతి శ్రీనివాస్ పాల్గొననున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి, సిరిసిల్ల, గంభీరావుపేట, ముస్తాబా ద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు పెద్ద సం ఖ్యలో తరలి రానున్నారు. సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు.