పాలకుర్తి, మార్చి 24: పెట్టుబడిదారులకు అడ్డగోలుగా దోచిపెడుతున్న మోదీని తెలంగాణ ప్రజలు నమ్మవద్దని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి ఎర్రోళ్ల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ధరలు పెంచుకుంట సామాన్యులను ఆగం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ప్రతి కార్యకర్త కలిసికట్టుగా ఉండాలని, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల విమర్శలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పాలకుర్తి మండలం జీడీనగర్ జీఎం ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే కోరుకంటిచందర్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముందుగా బసంత్‌నగర్ గ్రామం నుంచి జీడీనగర్‌కు బీఆర్ఎస్ మహిళలు, నాయకులు, రెండు కిలోమీటర్లు కార్యకర్తలతో భారీ ర్యాలీ తీశారు. అనంతరం ఎమ్మెల్యే చందర్ సమ్మేళనంలో సీఎం కేసీఆర్ సందేశాన్ని చదివి వినిపించగా, నాయకులు, కార్యకర్తలు, మహిళలు ‘జై కేసీఆర్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, 400 ఉన్న గ్యాస్ ధరను 24 సార్లు పెంచారని ఆయన ధ్వజమెత్తారు. మన తెలంగాణలో 3వేలకే దొరికే బొగ్గును కొనకుండా ఆస్ట్రేలియా నుంచి అంబానీ ద్వారా 25వేలకు టన్ను చొప్పున కొనాలని ఒత్తిడి తెస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చెప్పారు.
పెట్టుబడిదారులకు అడ్డగోలుగా దోచిపెడుతున్న మోదీని తెలంగాణ ప్రజలు విశ్వసించకూడదన్నారు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన మహనీయుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని, అందుకే బీఆర్ఎస్ పార్టీని స్థాపించి దేశ వ్యాప్తంగా తెలంగాణ మాడల్ అభివృద్ధిని చేపట్టాలని చూస్తున్నారని వివరించారు. రాబోయే రోజుల్లో మూడోసారి బీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ప్రతి కార్యకర్తా శక్తివంచన లేకుండా పోరాటం చేయాలని, బీజేపీ, కాంగ్రెస్ నాయకుల కల్లబొల్లి మాటలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులను గుర్తించడం ద్వారానే కోరుకంటి చందర్, రాకేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ వంటివారికి పదవులు వచ్చాయని చెప్పారు. కార్యకర్తలు కూడా గ్రామ స్థాయిలో కష్టపడి పనిచేస్తూ, పార్టీ ప్రతిష్టను పెంచాలని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల చౌకబారు ఆరోపణలను ఎక్కడికక్కడ ఖండించాలన్నారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లలో ఎలాంటి లీకేజీ లేకుండా ఉద్యోగాల నియామకం జరిగిందని, ఒక వ్యక్తి చేసిన పేపర్ లీకేజీని భూతద్దంలో చూపుతూ, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో వందలసార్లు పేపర్లు లీకేజీ అయ్యాయని, కోట్ల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకుని నిరుద్యోగుల పొట్టగొట్టారని విమర్శించారు.
రామగుండంలో గడిచిన 60 ఏళ్లలో కనీసం ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు. కానీ, కాంగ్రె స్, బీజేపీ నాయకులు ఎన్నికల సమయంలోనే ఇంటింటికీ తిరుగుతూ కల్లబొల్లిమాటలు చెబుతున్నారు. తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ కార్యకర్తలు వాటిని తిప్పికొట్టాలి. రామగుండానికి మెడికల్ కాలేజీ తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ నియోజవర్గానికి చేసిందేం లేదు. గోదావరిఖని, రామగుండం పట్టణాలతోపాటు పాలకుర్తి, అంతర్గాం మండలాల్లో సైతం నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న. రాబోయే ఆరునెలల్లో జరిగే ఎన్నికలకు ఇప్పటినుంచే గ్రామాల్లో కార్యకర్తలు సంసిద్ధం కావాలి. విజయమ్మ ఫౌండేషన్ ద్వారా అనేక మంది పేదలకు పెండ్లిళ్ల్లు చేయడంతోపాటు, కరోనా సమయంలో ఉచితంగా భోజన వసతి కల్పించినం. రామగుండాన్ని రతనాల గుండంగా మారుస్త. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్త.
-కోరుకంటి చందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే
గతంలో సహకార సంఘా లు నామమాత్రంగా ఉండే వి. రైతులు మందుబస్తాలకోసం, చెప్పులు క్యూలో ఉంచుకునేటోళ్లు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి కనుక, రైతుబంధు, రైతుబీమా ఇవ్వడంతోపాటు 24గంటల కరెంటు ఇస్తున్నడు. సహకార సంఘాలను బలోపేతం చేసి, రైతులకు సబ్సిడీలో ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయిస్తున్నడు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వడ్లు కొంటున్నడు. రైతులకోసం ఆలోచించే ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం చేయకుండా, మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషిచేయాలి.
-బయ్యపు మనోహర్ రెడ్డి, కన్నాల ఫ్యాక్స్ చైర్మన్