BRS Party | కథలాపూర్, సెప్టెంబర్ 2 : కథలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరుట్ల – వేములవాడ రోడ్డుపై ధర్నా చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ నాయకులు కథలాపూర్ మండలకేంద్రంలోని బస్టాండ్ వద్ద కోరుట్ల-వేములవాడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిరసనగా నాయకులు నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కరీంనగర్ మాజీ జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ మాట్లాడుతూ… తెలంగాణ రైతులకు శాశ్వత సాగునీటి సమస్య పరిష్కారం కోసం కేసీఆర్ ఎంతో కృషి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని, అనవసరంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడే మాటలకు అర్ధం లేదన్నారు. కేసీఆర్ రైతుల కోసం ఏం చేశారో.. తెలంగాణలోని ప్రతీ రైతుకు తెలుసన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నాగం భూమయ్య, బీఆర్ఎస్ నాయకులు మామిడిపెల్లి రవి, కల్లెడ శంకర్, గడ్డం భూమారెడ్డి, వర్దినేని నాగేశ్వర్రావు, లోక శశిరెడ్డి, గండ్ర కిరణ్‌రావు, బొడ్డు బాలు, దొప్పల జలేందర్, బద్దం మహేందర్‌రెడ్డి, గుండారపు గంగాధర్, నాంపెల్లి లింబాద్రి, ఏజీబీ మహేందర్, కొండ ఆంజనేయులు, తిరుజానీ, ఓంకార్, నవీన్, రాజ్‌కుమార్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.