కాంగ్రెస్ సర్కారు రైతు వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నది. రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దగా చేస్తున్నది. ఎన్నికల ముందు 2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, బోనస్ అంటూ ఇలా ఎన్నో చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నీరుగారుస్తున్నది. మొన్నటిదాకా వరికి 500 బోనస్ చెల్లిస్తామని మభ్యపెట్టి.. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే మాటమారుస్తున్నది. తాజాగా, సన్నవడ్లకే బోనస్ అని రేవంత్‌రెడ్డి చెప్పిన మాటతో రైతులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.
ఇప్పటికే రైతుభరోసాను దాటవేశారని, ఇప్పుడు బోనస్ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడంపై ఆందోళనకు గురవుతున్నారు. పోయినేడు యాసంగి వరకు నిరందీగా సాగు చేసుకున్నామని, ఇప్పుడు మాత్రం ఎవుసం అంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. సాగునీరు, కరెంట్‌కు గోసపడ్డామని, రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యం అమ్ముకునేందుకు తిప్పలు పడతున్నామంటూ కన్నీరు పెడుతున్నారు. ఈ పరిస్థితులను చూసి చలించిపోయిన బీఆర్ఎస్ అధినేత మరోసారి రైతుల కోసం ఉద్యమిస్తున్నారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు.
కరీంనగర్, మే 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రధాన పంట అయిన వరి ప్రతి క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు చెప్పింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా చేర్చింది. రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకులు కూడా ప్రతి సభలో ఈ విషయాన్ని విపరీతంగా ప్రచారం చేశారు. రైతు డిక్లరేషన్ సభలు పెట్టి మరీ గొప్పగా చెప్పుకున్నారు. అంతే కాకుండా, బీఆర్ఎస్ ఇచ్చిన రైతుబంధు తరహాలో రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరానికి ఏటా 10 వేలు కాకుండా..
మరో 5 వేలు కలిపి 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాసంగి పంటకు మాత్రం ఎకరానికి 5 వేలు మాత్రమే ఇచ్చారు. వంద రోజుల్లో రైతులకు 2 లక్షల వరకు పంట రుణమాఫీ చేస్తామని చెప్పినా.. ఇప్పటి వరకు చేయలేకపోయారు. పైగా ఆగస్టు 15 వరకు అమలు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించినప్పటికీ.. రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రైతు భరోసాను కూడా వాయిదా వేయగా, ఇప్పుడు వడ్లపై బోనస్ హామీని కూడా పక్కదారి పట్టిస్తుండడం అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నది.
రైతులు పండించిన పంటలపై బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి ఎన్నోసార్లు చెప్పారు. వరి క్వింటాల్‌కు 500 ఇస్తామని పదే పదే గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే మాట మార్చారు. సీఎం హోదాలో హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సన్నవడ్లు పండించిన వారికే బోనస్ ఇస్తామని చెప్పడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కారు తీరుపై ఆగ్రహిస్తున్నారు.
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలి. ప్రతి క్వింటాల్ ధాన్యానికి కేంద్రం ఇచ్చేది 2,203 కాగా, దీనికి 500 బోనస్ తోడైతే 2,703 అయ్యేది. రైతులకు ఇది ఎంతో ఊరటనిచ్చేది. కానీ, ఇప్పుడు రేవంత్ ప్రకటనతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఈ సీజన్లోనే బోనస్ వస్తుందని ఆశించినా ప్రయోజనం లేకపోయిందని వాపోతున్నారు. ఇన్నాళ్లూ మభ్యపెట్టిన ప్రభుత్వం, తీరా ఇప్పుడు సన్నవడ్లకేనంటూ ప్రకటించడం ఎంత వరకు కరెక్టని మండిపడుతున్నారు.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువ మంది దొడ్డు వడ్లనే పండిస్తారని, సన్నాలు పండించే వారిని వేళ్ల మీద లెక్కించవచ్చని చెబుతున్నారు. కేవలం సన్నాలు పండించే వారికి మాత్రమే బోనస్ వర్తిస్తే తమ పరిస్థితి ఏంటని? ఇలాంటి హామీలు ఇచ్చి ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదని, ఇప్పటి వరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆగ్రహిస్తున్నారు. రైతును రాజును చేయాలనే లక్ష్యంతో పనిచేసిన కేసీఆర్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంతో తేడా కనిపిస్తున్నదని చెబుతున్నారు.
మొన్నటి దాక పండిన ప్రతీ వడ్లగింజకు మద్దతు ధరతోపాటు 500 బోనస్ ఇస్తమని కాంగ్రెస్ పెద్దలు చెప్తే సపోర్ట్ చేసినం. కనీ, ఇప్పుడు కేవలం సన్న వడ్లకే ఇస్తమనుడు కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం రైతులను దగా చేసింది. గత పసలు నుంచి సగానికి పైగా పెట్టుబడికే పోతున్నయి. ఈ ప్రభుత్వం క్వింటాల్‌కు బోనస్ ఇస్తమంటే మిగుల్తయి అనుకుంటున్నం. కనీ, ఇప్పుడు మాట మార్చుతున్నరు.
-ఎల్లాల లచ్చిరెడ్డి, రైతు, పారువెల్ల, గన్నేరువరం మండలం(తిమ్మాపూర్)
ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజులకే రైతులకు న్యాయం చేయదని మాకు అర్థ మైంది. పండిన వడ్ల నే ఇబ్బంది లేకుంట కొనుడు ఎక్కవ అనుకున్నం. ఇగ ఈ బోనస్ ముచ్చట బో గసే అని అనుకు న్నం. అనుకున్నట్టే అంతా బోగస్ ముచ్చటే అయింది. కేవలం సన్నవడ్లకే రూ.500 బోనస్ ఇస్తం అని మాట మార్చుతున్నరు. ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేకి. పండిన ప్రతి వడ్ల గింజకు బోనస్ కట్టియ్యాలె. లేకపోతే ఊరుకోం.
-ఆవుల మల్లేశ్, రైతు, రామకృష్ణకాలనీ(తిమ్మాపూర్)
ఉమ్మడి రాష్ట్రంలో దండుగ అయిన వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నదాతకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్నారు. పదేళ్లలో రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా, సాగునీరు, 24 గంటల కరెంటు వంటివి కల్పించి భరోసా కల్పించారు. అంతే కాకుండా, ప్రతిపక్షంలోనూ రైతుల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సిద్ధమయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం కావడంతో సర్కారుపై యుద్ధం చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోగా.. గత నెల 5న కరీంనగర్ రూరల్ మండలం మొగ్ద్దుంపూర్, బోయినపల్లిలో స్వయంగా పంటలను పరిశీలించి, రైతులకు ‘మేమున్నా’మంటూ అభయమిచ్చారు. సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25 వేల పరిహారం చెల్లించాలని, వరి క్వింటాల్‌కు 500 బోనస్ చెల్లించాలని, 2 లక్షల రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలని గత నెల 6న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేసి రైతులకు మద్దతుగా నిలిచారు.
అంతేకాకుండా, సాగునీరు అందక పంటలు ఎండుతుండడంతో రైతుల వెన్నంటి ఉంటూనే సర్కారు దిగొచ్చేలా ఆందోళనలు చేపట్టారు. తాజాగా, సీఎం రేవంత్‌రెడ్డి సన్న వడ్లకే 500 బోనస్ ఇస్తామని మాట మార్చడంపై రైతులు ఆందోళన చెందుతుండగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి ఉద్యమానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక చర్యలను ఖండిస్తూ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.