పెద్దపల్లి, మే 3 (నమస్తే తెలంగాణ)/ గోదావరిఖని : ‘తెలంగాణ సింగరేణికి కొంగుబంగారం. ఒక ఉద్యోగ వనరు. లక్షల మంది కార్మికులు, వాళ్లను అనుసరించి ప్రజలు బతికే ప్రాంతం. కానీ, ఇక్కడ చాలా పెద్ద కుట్ర జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోవుడే ఆలస్యం. నరేంద్రమోదీ, రేవంత్‌రెడ్డి కలిసి సింగరేణిని ఊడగొడుతరు. సింగరేణి కార్మికులారా.. తస్మాత్ జాగ్రత్త’ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తం చేశారు. అప్పుడు కాంగ్రెస్ సింగరేణిని సగానికి అమ్మితే.. ఇప్పుడు బీజేపీ మొత్తానికే అమ్మాలనే కుట్ర చేస్తున్నదని విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో రోడ్‌షో నిర్వహించగా, ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగరేణిపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్రలను ఎండగడుతూనే.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణిని, కార్మికులను కాపాడుకున్న తీరును వివరించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను అర్థమయ్యేలా చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి గులాబీ జెండాను పట్టుకున్న కొప్పుల ఈశ్వర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సింగరేణి కార్మికుల కష్టాలు, నష్టాలు అన్నీ తెలిసిన కొప్పులను గెలిపిస్తే సింగరేణి విస్తరించి ఉన్న పది జిల్లాల గొంతుకగా నిలుస్తారని ప్రశంసించారు.
నాడు నష్టాల్లో ఉన్న సింగరేణిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లాభాల్లోకి తెచ్చామని, కార్మికులకు గతంలో ఎప్పుడూ లేని విధంగా అనేక హక్కులు కల్పించామని గుర్తు చేశారు. ఆనాడు పోగొట్టిన డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించామని, 19 వేల మంది పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇచ్చామని చెప్పారు. సిమ్స్ అనే పేరు మీద సింగరేణి మెడికల్ కాలేజీ పెట్టుకున్నామని, ఆ కాలేజీలో ఐదు శాతం కార్మికుల పిల్లలకే సీట్లు వచ్చేటట్టు చేసుకున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విదేశాల నుంచి ఎలాంటి బొగ్గు దిగుమతి చేసుకోకుండా గట్టిగా అడ్డుకున్నామన్నారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లి అదానీకి సింగరేణిని అప్పగించేందుకు కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. నరేంద్ర మోదీ తమ్ముడు అదానీ బొగ్గు కోసం.. మన దగ్గర నాలుగు వేలకు టన్ను దొరికే బొగ్గును అక్కడ 28 వేలకు టన్ను కొనాలని చెప్పినా తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. ‘నువ్వు ఏం చేసినా సరే.. నా ప్రాణం పోయినా సరే ఒప్పుకోను. నా సింగరేణి బొగ్గున్నది. నా సొంత బొగ్గున్నది. నీ బొగ్గు నాకెందుకు’ అని తెగేసి చెప్పానని గుర్తు చేశారు. బడే భాయ్ మోదీ, చోటా భాయ్ రేవంత్‌రెడ్డి ఇద్దరూ కలిసి అదానీతో కుమ్మక్కై మన సింగరేణిని మనకు కాకుండా చేసే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో కార్మికులంతా ఆలోచన చేయాలని సూచించారు. ఒక్క గోదావరిఖని కాదు.. భూపాలపల్లి, సత్తుపల్లి నుంచి ఇక్కడి దాకా ఉన్న మిత్రులు ఆలోచించాలని కోరారు. సింగరేణిని కాపాడే శక్తి పార్లమెంటులో అడ్డుకునే గళం, బలం, ధైర్యం బీఆర్ఎస్కే ఉందని స్పష్టం చేశారు. మొత్తం బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే పార్లమెంట్లో ఎగిరి గంతేసి కొట్లాడుతారని, పీక పట్టుకొని మా సింగరేణిని ఎట్లా మూస్తావని నిలదీస్తారని, సింగరేణిని రక్షించేందుకు బలంగా నిలుస్తారన్నారు.
మన నిధులు మనకు దక్కాలంటే సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్ బిడ్డలనే గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ రోడ్‌షోలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ టీ భానుప్రసాదరావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, మాజీ ఎంపీ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ చైర్మన్లు రవీందర్‌సింగ్, కోలేటి దామోదర్, రఘువీర్‌సింగ్, చిరుమిల్ల రాఖేశ్, నాయకులు గంట రాములు, కౌశిక్ హరి, దాసరి ఉష, తదితరులు పాల్గొన్నారు.
మీ అందరికీ ఒక మాట మనవి చేస్తున్న. ఐదు నెలల కింద ఎట్లుండె. ఇప్పుడెట్లున్నది. ఇవాళ పెద్దపల్లి జిల్లాలోనే 50 వేల ఎకరాలకుపైగా పంట పొలాలు ఎండిపోయినయ్. దీనికి కారణం ఎవరు? పదేళ్లలో ఎప్పుడైనా ఎండిపోయినయా? ఒక్క ఎకరమైనా ఎండిందా? మరి ఈ రోజు ఎందుకు ఎండిపోయినయో దయచేసి ఆలోచన చేయాలె. తొమ్మిది సంవత్సరాల్లో కరెంట్ కోతల్లేవు. ఈ రోజు కరెంట్ కోతలు ఎలా వచ్చినయి? దీనికి కారణం కాంగ్రెస్సే కదా?
తెలంగాణ ఉద్యమ సమయంలో నేను అనేక సార్లు గోదావరిఖనికి వచ్చిన. అప్పుడు గోదావరిల పైసా ఎయ్యాలంటే నీళ్లు వెతికి వెతికి వేసేది. అటువంటి గోదావరిని సజీవంగా చేసినం. ఎంత బ్రహ్మాండంగా నీళ్లుండెనో చూసినం. మీకు ఎంత మంచిగా నీళ్లు వచ్చినయో చూసిన్రు. ప్రతి ఇంటికీ రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చి మంచిగా నీళ్లిచ్చినం. ఈరోజు రెండు రోజులకోసారి నీళ్లస్తన్నయి. ఎందుకు మురికి నీళ్లస్తా ఉన్నయి. దీనికి కారణం ఎవరు? దయచేసి మీరు ఆలోచన చేయాలె.
మంచిగున్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్. ఇది యువకులకు తెల్వదు. వాస్తవానికి సింగరేణి మన తెలంగాణ సొత్తు. మన ఆస్తి. వందశాతం మనకే ఉండె. కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి, సింగరేణిని నష్టాల్లోకి పంపించి, ఆ అప్పు చెల్లించలేక 49 శాతం వాటాను కేంద్రానికి అప్పజెప్పిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్. నాడు అప్పులపాలు చేసిన ఆ పార్టీ, మరోసారి సింగరేణిని పూర్తిగా ప్రైవేటు పరం చేయడానికి కుట్ర చేస్తున్నది.
నేను ఒక్క మాట చెబుతున్న. చాలా పెద్ద ప్రమాదం రాబోతున్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటడు. గోదావరి నీళ్లు ఎత్తుకొని పోత.. ఇచ్చంపల్లి కాడా ప్రాజెక్టు కడుత. నేను కర్ణాటకు ఇస్త అంటడు. కేసీఆర్ బతికుండగా గోదావరి నీళ్లు తీసుకపోతా అంటే నా ప్రాణం పోయిన మంచిదే కానీ, ఒప్పుకోను అని తేల్చి చెప్పిన. మనకున్న ఒకే ఒక గోదావరి మన బతుకు. దాన్నే తీసుకపోతా అంటే కాంగ్రెస్, ముఖ్యమంత్రి గానీ, ఎవరుగాని నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు.
ఆనాడు ఉద్యమంలో ఒక దీపంతో మరో దీపం వెలిగించినట్టు.. ఎప్పుడైతే తెలంగాణకు ప్రమాదం వస్తదో.. ఎప్పుడైతే తెలంగాణ ప్రమాదంలో పడుతదో మనమందరం ఏకం కావాలి. సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికలు వస్తయి.. పోతయి. ఎవరు గెలిస్తే మన హక్కులు కాపాడుతరు? మన నదులు కాపాడుతరు? మన సింగరేణిని కాపాడుతరు? దయచేసి ఆలోచన చేయాలి. అది జరగకపోతే పెద్ద ప్రమాదంలో పడుతం. – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
గోదావరిఖనిలో పుట్టి మీ కాళ్లు, చేతుల్లో పెరిగిన బిడ్డ. మీ మధ్యన పెరిగిన బిడ్డ కొప్పుల ఈశ్వర్ గెలిస్తేనే తప్పకుండా మన కోసం కొట్లాడుతడు. బొగ్గు గని కార్మికుడిగా 26 ఏండ్లు పనిచేసి, మీ దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని కూడా అలంకరించి ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మీ ముందు నిలబడ్డడు. కొప్పుల గురించి మీకు తెలుసు. సౌమ్యుడు, నిస్వార్థపరుడు, గోదావరిఖని బిడ్డ, సింగరేణి కార్మికుల కష్టాలు, నష్టాలు అన్నీ తెలిసిన నాయకుడు. ఆయనను గెలిపిస్తే సింగరేణి విస్తరించి ఉన్న పది జిల్లాల గొంతుకగా నిలుస్తడు. మీ తరఫున కొట్లాడుతడు. సింగరేణి వైభవాన్ని కాపాడుతడు. దయచేసి అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, మేధావులు విజ్ఞతతో ఆలోచించాలి. కారు గుర్తుకు ఓటేసి కొప్పులను గెలిపించాలి.
– గోదావరిఖని రోడ్‌షోలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్
మీ అందరినీ ఒకటే కోరుతున్న. ఎన్నికల్లో గత్తరబిత్తరై ఓటేయద్దు. ఆగమాగమై ఓటేయద్దు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆలోచన చేసి.. ఎవరు ఏ టైంకు ఉంటే కరెక్టో నిర్ణయించి ఆలోచించి ఓటేయాలి. లేదంటే చాలా ప్రమాదంలో పడుతం. ఆ బీజేపీ లేపే మత విద్వేషంలో పడితే ఏమీ రాదు. బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించుకుంటే తెలంగాణ నదులు, నీళ్లు, బొగ్గు, మన సింగరేణి, మన ఉద్యోగాలను కాపాడుకోవచ్చు. బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉన్నది. అరచేతిలో వైకుంఠం చూపించి, ఆరు గ్యారెంటీల పేర మోసం చేసిన కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది. బీఆర్ఎస్సే తెలంగాణకు బలం. తెలంగాణ గళం. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ రాజ్యమే. ప్రజల దీవెనలతోని అన్నిరకాలుగా ముందుకుపోతం. – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్