జగిత్యాల, మార్చి 18: జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్, సారంగాపూర్ మండలాల్లో మక్క కొనుగోలు కేంద్రాలు లేక రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఎమ్మెల్సీ ఎల్ రమణ వాపోయారు. ప్రభుత్వం వెంటనే మక్క పంటలు విక్రయించుకోవడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన శాసన మండలిలో ప్రసంగించారు.
కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో వడగళ్ల వానలకు రైతులు నష్టపోతున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. జగిత్యాల నియోజకవర్గంలోని నిరుపేదలందరికీ పకా ఇండ్లు ఉండాలని ఉద్దేశంతో తొలి సీఎం కేసీఆర్ హయాంలో డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించామన్నారు.
అయితే డబుల్ బెడ్రూం ఇండ్లల్లో నివసిస్తున్న ప్రజలకు ఇప్పటివరకు మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు లేకపోవడం బాధాకరమన్నారు. నూకపెల్లి డబుల్ బెడ్రూం అర్బన్ కాలనీలో మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు. డంప్‌యార్డు సమసను పరిష్కరించాలని కోరారు. కాంగ్రెస్ సర్కారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12వేల జీవన భృతి అందించాలని డిమాండ్ చేశారు.