జమ్మికుంట, నవంబర్15 : “పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ అభివృద్ధి.. సంక్షేమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టింది. ఆకుపచ్చని తెలంగాణగా మార్చింది. దేశానికే దిక్సూచిగా నిలిపింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ రావడం ఖాయం. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటరు. హుజూరాబాద్‌లో వేరే వాళ్లను గెలిపిస్తే లాభం ఉండదు. గులాబీ జెంగానే ఎగరాలి. రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి చేసుకుందాం. కాంగ్రెస్‌కు ఓటేస్తే కటిక చీకట్లలో మగ్గుతం. బీజేపీ ఇక్కడ వచ్చేది లేదు.. సచ్చేదీ లేదు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ పైసా పనిచేయలే. మనల్ని చూడలే. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి.. మీ ఇంటి బిడ్డగా సమస్యలన్నీ పరిస్తరిస్తా..’ అని బీఆర్ఎస్ హుజూరాబాద్ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మండలంలోని అంకుశాపూర్, మడిపల్లి గ్రామాల్లో రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రచారం చేశారు. సాయంత్రం మున్సిపల్ పరిధిలోని కేశవాపూర్(15వ వార్డు), కృష్ణాకాలనీ(26,27,28వ వార్డు)లో కార్నర్ మీటింగ్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
గడిచిన రెండేళ్లుగా ప్రజల మధ్యనే తిరుగుతున్నానని, ప్రజాసమస్యలన్నీ తన సమస్యలుగా భావిస్తూ పనిచేస్తున్నానని చెప్పారు. తన మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, తన కూతురు, భార్యపై మహిళలని చూడకుండా అవహేళన చేసే నాయకులకు గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఈటల రాజేందర్ ప్రజలను ఎందుకు కలవడం లేదని ప్రశ్నించారు. ఆయనకు రాజకీయం, స్వలాభం తప్ప వేరే ధ్యాసలేదని ఆరోపించారు. ఉప ఎన్నికలో గెలచి రెండేళ్లయినా ఒక్క పని కూడా చేయని ఈటల, మళ్లీ గెలిచి ఏం చేస్తాడని ప్రశ్నించారు. సానుభూతి అవసరం లేదని, అభివృద్ధి ఒక్కటే మనకు కావాలని సూచించారు. బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆయా ప్రచార కార్యక్రమాల్లో కౌశిక్‌రెడ్డి సతీమణి శాలినీరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్‌రావు, సర్పంచ్‌లు రాజిరెడ్డి, పరుశరాములు, కౌన్సిలర్లు రమేశ్, రాము, భాస్కర్, దీప్తి-కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉప ఎన్నికల్లో కల్లబొల్లి మాటలు చెప్పిండు. గెలిచిండు. ఒక్క రూపాయైనా కేంద్రం నుంచి తెచ్చిండా?. అభివృద్ధి చేసిండా?. చెప్పాలె. చర్చ పెట్టాలె. ఈటలవన్నీ మాయ మాటలు. బూటకపు మాటలు చెప్తడు. అతడి మాటలు నమ్మొద్దు. ఆయతో ఒక్క పని కూడా కాదు. అతడిని గెలిపిస్తే నష్ట పోతాం. దేశంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నది. కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెడుతున్నది. రానున్న రోజుల్లో ప్రతీది ప్రైవేటీకరణ చేస్తుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకుండా పోతాయి. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత రోజులే వస్తాయి. ప్రజలు, రైతుల ఇబ్బందులు పడుతరు. కర్ణాటకలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్రు. కాంగ్రెస్, బీజేపీని నమ్మి ఆగం కావద్దు. బీఆర్ఎస్కే పట్టంగట్టండి.
– రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్