మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 5: తెరచాటు రాజకీయాలు చేయడం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అలవాటేనని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని.. కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం మెట్పల్లి పట్టణ అనుబంధ గ్రామమైన ఐదో వార్డు ఆరపేటతోపాటు 1, 2, 7, 8, 13, 14, 22 వార్డు మఠంవాడ, సింగపూర్ కాలనీ, వెల్లుల రోడ్డు, రామాలయం సమీపంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌ల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకుండా మోసం చేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ బస్సులో ఫ్రీ అంటూనే ఇష్టం వచ్చినట్లు చార్జీలు పెంచారన్నారు. అభివృద్ధి చేయడానికి నిధుల్లేవంటున్న రేవంత్‌రెడ్డి.. పుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడేందుకు వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థులు మార్గం హన్మాండ్లు, జక్కం లక్ష్మీ-బాబు, ద్యావనపెల్లి రాధ-ప్రసాద్, దీవకొండ మానస-విష్ణువర్ధన్, బోలుమల్ల వినయ్, గజం లక్ష్మి-రవికాంత్, అంగడి పురుషోత్తం పాల్గొన్నారు. అలాగే, కోరుట్ల పట్టణంలోని 1, 12, 13, 26, 27, 28 వార్డుల్లో కార్నర్ మీటింగ్‌లకు హాజరై ఎన్నికల ప్రచారం నిర్వహించారు.