సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 28: బీఆర్ఎస్ నేతలు, రైతులపై అక్రమ కేసులు పెడితే ఊరుకోమని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. జైలుకు పంపాలని కక్షపూరితంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ‘జైలు భరో’ చేపడుతామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అక్రమ అరెస్ట్‌లు ఆపాలని, వేధింపులకు గురిచేయొద్దని సూచించారు. రైతులపై మీకు చిత్తశుద్ధి ఉంటే రైతు సంక్షేమానికి కృషి చేయాలని, అభివృద్ధికి పాటుపడాలని హితవు పలికారు. రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని భరోసానిచ్చారు. అక్రమ కేసులో జైలుకు వెళ్లిన తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన రైతు అబ్బడి రాజిరెడ్డి బుధవారం మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో బెయిల్ మంజూరై, ఇంటికి వచ్చాడు. కాగా, శుక్రవారం రాజిరెడ్డిని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజన్న, సీనియర్ నేత బొల్లి రామ్మోహన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాజిరెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. రాష్ట్రంలో ఎకడా లేని విధంగా సిరిసిల్లలో ప్రభుత్వ భూములు ఆక్రమించారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు, సామాన్య రైతులపై కేసులు పెట్టి జైలుకు పంపడం దారుణమన్నారు. కలెక్టర్ రెస్యూమ్ చేసుకున్న 350 ఎకరాలు ఎవరివని ప్రశ్నించారు? వాటి వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలతోపాటు ఇంటిపేరు ఒకేలా ఉన్న సామాన్య రైతుపై కేసు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. రైతులను అరెస్ట్ చేస్తామని, జైలుకు పంపుతామని బెదిరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
రాజిరెడ్డికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని, ఆయన 30 గుంటల భూమి తిరిగి వచ్చేలా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ సింగిల్ విండో చైర్మన్లు బండి దేవదాస్ గౌడ్, కోడూరు భాసర్ గౌడ్, మాజీ ఎంపీపీ మానస, మాజీ అధ్యక్షుడు అంకారపు రవీందర్, మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వెంకటరమణా రెడ్డి, నాయకులు మాట్ల మధు, వలకొండ వేణుగోపాలరావు, పడిగెల రాజు, పబ్బతి విజేందర్ రెడ్డి, బండి జగన్, తాండ్ర రవీందర్ రావు, సతీశ్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రామాగౌడ్, రమేశ్, కృష్ణ, పూర్ణ, జవహర్ రెడ్డి, మిరాల భాసర్యాదవ్, అఫ్రొజ్, ఎల్లం యాదవ్, జగత్, చిరంజీవి, ప్రేమ్‌కుమార్, అమర్‌రావు, రమేశ్, శ్రీకాంత్ తదితరులున్నారు.