Nandi Medaram | ధర్మారం, మే17 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై ఆగ్రహిస్తూ ఆదివారం బీఆర్ఎస్ నాయకులు కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో తూకం చేయకుండా పేరుకుపోయిన ధాన్యం కుప్పలను వారు పరిశీలించారు. రైతులతో ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతులు తమ బాధలను బీఆర్ఎస్ నాయకులతో ఏకరువు పెట్టారు. రోజుల తరబడి దాన్యం కొనుగోళ్ల కోసం తాము ఎదురు చూస్తున్నామని వివరించారు. తేమ శాతం నిర్ధారణ అయినప్పటికీ కూడా ధాన్యం తూకం చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలో ధాన్యం నింపడానికి గోనె సంచులు ఇవ్వడం లేదని రైతుల ఆరోపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ మండల శాఖ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ వడ్లు కొనుగోలును త్వరిగతన కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వర్షా కాలం సమీపిస్తున్న నేపథ్యంలో ధాన్యం తడిచి రైతులు నష్టపోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ధాన్యం తూకంలో ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేస్తామని రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కోతను విధిస్తున్నారని శ్రీధర్ విమర్శించారు. కోతలు లేకుండా వడ్ల కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నంది మేడారం ప్యాక్స్ వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లయ్య, మాజీ ఎంపీటీసీ మిట్ట తిరుపతి, పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి పులి నవీన్,నాయకులు దేవి రమణ, నేరేళ్ల లచ్చన్న, పుర్ర గంగన్న, మందపల్లి శివయ్య, సాన సత్తయ్య, మిట్ట రాజయ్య, శ్రీమంతుల విజయ్, బొడ్డు నర్సయ్య,రమణవేణి మల్లేశం, మేకల బాలకుమార్, బొంతల నర్సింగం, యండి రహీం, బొంకురీ రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.