బీసీ కమిషన్ ఎదుట బీసీ సంఘాల ప్రతినిధులు గోడు వెల్లబోసుకున్నారు. ఏడు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతున్నదని వాపోయారు. స్థానిక సంస్థల్లో 42 శాతం కాకుండా 52 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అలాగే విద్య, ఉద్యోగాల్లోనూ ఈ దామాషాలోనే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు పాల్గొనగా, బీసీ నాయకుల ముసుగులో ఉన్న కాంగ్రెస్ నాయకులు ‘గో బ్యాక్’ అంటూ నినదించారు. పార్టీలకు అతీతంగా బహిరంగ విచారణ జరుగుతున్నదని కమిషన్ చైర్మన్ చెప్పినా.. ఒక్క ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికే మాట్లాడే అవకాశమిచ్చి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌ను మాట్లాడకుండా అడ్డుకున్నారు. అనంతరం మీడియా ఎదుట ఇద్దరు ఎమ్మెల్యేలు ఆగ్రహించారు. ఇది రాజకీయ సభ కాదని చెబుతూనే అధికారాన్ని ఉపయోగించి తమ గొంతు నొక్కే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
కరీంనగర్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ)/ కలెక్టరేట్ : స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను ఖరారు చేసేందుకు శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్లో బీసీ కమిషన్ నిర్వహించిన బహిరంగ విచారణలో సంబంధిత కుల సంఘాల ప్రతినిధులు వారి గోడును వెల్లబోసుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్వహించిన ఈ విచారణలో బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్, సభ్యులు రంగు బాలలక్ష్మి, రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్‌తోపాటు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ కులాల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాల గురించి ఆయా సంఘాల ప్రతినిధులు కమిషన్ ఎదుట వాదనలు వినిపించారు.
గాండ్ల తిలకుల, యాదవ, కుర్మ, బేడ బుడిగ జంగాలు, వీర క్షత్రీయ, రజక, స్వర్ణకార, కమ్మరి, శాలివాహన, పూసల, దూదేకుల, గౌడ, మున్నూరు, బలిజ, గంగపుత్ర, ఆరెకటిక, ముదిరాజ్, తదితర 20కి పైగా కుల సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా కమిషన్ ఎదుట తమ సమస్యలు ఏకరువు పెట్టారు. తమ కులాల దా మాషా ప్రకారంగా 50శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అదే సమయంలో గత ఎన్నికల్లో ఉదయ్‌పూర్ సభలో బీసీల కోసం ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ఏడు దశాబ్దాలుగా బీసీలకు అన్యాయం జరుగుతున్నదని, ఇప్పటికైనా న్యాయం జరగాలని, లేని పక్షంలో ఉద్యమం తప్పదని కొన్ని సంఘాల నాయకులు స్పష్టం చేశారు. బీసీ సంఖ్యా పరంగా ఉన్నా అధికార పరంగా లేరని, అధికారం ఉంటేనే ఇంకొకరికి ఇచ్చే స్థితిలో ఉండేవారిమని, ఇప్పుడు అడుక్కునే స్థితిలో ఉన్నామని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా 80 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ పార్లమెంట్‌లోనే చట్టం తేవాలని పలువురు బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
వెనుకబడిన తరగతుల వర్గాల సామాజిక, ఆర్థిక, రాజకీయ పురోగతిపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన బీసీ కమిషన్‌కు యాభై శాతం రిజర్వేషన్ల పెంపుపైనే అత్యధిక విజ్ఞప్తులు వచ్చాయి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రకటిస్తారని భావిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 60 శాతానికి పైగా అవే ఉన్నట్టు అధికారుల ద్వారా తెలుస్తున్నది. రిజర్వేషన్ల పెంపు కోసమే కమిషన్ అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ విజ్ఞప్తులు రావడంతో సభ్యులు వీటిపై ఆసక్తిగా చర్చించుకోవడం కనిపించింది. అలాగే, గ్రూపుల మార్పుపైనా ఆయా కులాల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి.
కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల వ్యవహారశైలితో కొన్ని కులాల వారు ఆయా కులాల గ్రూపులను వీడి ఇతర కులాల గ్రూపుల్లో చేరి ధ్రువీకరణ పత్రాలు పొందారని, దీంతో ఆయాగ్రూపుల్లో పోటీ ఏర్పడి అసలైన వారికి అన్యాయం జరుగుతున్నదంటూ వినతిపత్రాలు అందాయి. గతంలో బీసీ-ఏ గ్రూపులో రజక, నాయీబ్రహ్మణ కులాలతోపాటు కేవలం 32 కులాలకు చెందిన వారు మాత్రమే ఉండగా, తాజాగా 60 కులాలను చేర్చడంతో అర్హులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారంటూ ఉమ్మడి జిల్లాలోని రజక, నాయీబ్రాహ్మణ కులాలకు చెందిన పలు సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
ఉన్నత కులాలకు చెందిన వారు కూడా బీసీ-ఏ గ్రూపులో రిజర్వేషన్ పొందుతుండగా, తమ కులాలు వెనుకబాటుకు గురవుతున్నాయని, ఆయా కులాలను తమ గ్రూపులో నుంచి తొలగించాలంటూ కమిషన్ బృందానికి విన్నవించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో ముదిరాజ్‌లు మినహా ఓడ బలిజ, బెస్త, గంగపుత్ర కులాలకు చెందిన వారు నామమాత్రంగానే ఉన్నా వేల సంఖ్యలో కుల ధ్రువీకరణ పత్రాలు అధికారులు జారీ చేసినట్టు పలువురు ఆధారాలతో సహా కమిషన్‌కు అందజేశారు. జగిత్యాల జిల్లా నుంచి వచ్చిన పలు కుల సంఘాల ప్రతినిధులు అక్రమంగా తమ కుల గ్రూపుల్లో చొరబడి విద్య, ఉద్యోగ రంగాల్లో తమకు అందాల్సిన అవకాశాలను ఎగరేసుకుపోతున్నారంటూ కమిషన్ ఎదుట ఏకరువు పెట్టారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా తమ పాలిట శరాఘాతంగా మారుతున్నాయని, వాటిని సత్వరమే రద్దు చేయాలంటూ పలు సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తక్కువ సంఖ్యలో ఉన్న ఓసీల కోసం పది శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండగా, ఇటీవల నిర్వహించిన పోటీ పరీక్షల్లో తమ కులాల్లోని యువత అత్యధిక మార్కులు పొందినా, సీట్లు లభించలేదంటూ కమిషన్ ఎదుట వాపోయారు. క్వాలిఫై అయిన ఓసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో సీట్లు పొంది, దర్జాగా ఉన్నత విద్య, ఉద్యోగాలు చేసుకుంటున్నారంటూ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తేనే ఆర్థికంగా ఎదుగుదల సాధ్యమవుతుందని వినతిపత్రాలు అందజేశారు. స్వీకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి అందిస్తామని కమిషన్ సభ్యులు వెల్లడించారు.
బీసీ కమిషన్ విచారణలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనాలని సమాచారం ఇచ్చారు. కానీ, ఉమ్మడి జిల్లా పరిధిలోని కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు హాజరు కాలేదు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆర్అండ్బీ అతిథి గృహంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి విన్నవించినట్టు కమిషన్ చైర్మన్ నిరంజన్ ప్రెస్మీట్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో చాటుగా కమిషన్‌ను కలిసి తమ వాదనలు వినిపించడం ఏమిటని బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామంతా కలెక్టరేట్లో ఉంటే నాయకులు అక్కడ కలవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తమ కులాలపై కాంగ్రెస్ నాయకులకు ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అర్ధమవుతోందని స్పష్టం చేస్తున్నారు.
వినతిపత్రాలు అందజేయడంలో గందరగోళం నెలకొనకుండా హెల్ప్‌డెస్క్, రిజిస్ట్రేషన్ కౌంటర్లను వేర్వేరుగా ఆడిటోరియంలో ఆవరణలో ఏర్పాటు చేశారు. కరీంనగర్ నుంచి 99 విజ్ఞప్తులు, జగిత్యాల నుంచి 29, పెద్దపల్లి నుంచి 32, సిరిసిల్ల నుంచి 53 అర్జీలు మొత్తంగా 213 స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, కమిషన్ చైర్మన్, సభ్యులు మాట్లాడుతుండగా రెండుసార్లు విద్యుత్ అంతరాయం కలిగింది. దీంతో సమావేశ స్థలిలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఐదు నిమిషాలకు పైగా కరెంట్ నిలిచిపోవడంతో సంబంధిత యంత్రాంగం వెంటనే స్పందించి, సమస్యను పరిష్కరించింది. సాంకేతిక లోపంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తినట్టు వెల్లడించింది.
వెనుకబడిన కులాల సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులపై నిర్వహించనున్న సమగ్ర ఇంటింటి సర్వేను సక్సెస్ చేయాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. బీసీల రిజర్వేషన్ కోసం బీసీ కమిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్ బృందం వివిధ జిల్లాల నుంచి హాజరైన బీసీ సంఘాల ప్రతినిధులకు ప్రజాభిప్రాయ సేకరణపై వివరించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు.
సమగ్ర ఇంటింటి సర్వేకు సంబంధించిన హౌస్ లిస్టింగ్ కసరత్తు శుక్రవారం నుంచి మొదలైందని వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన వారికి అందాలంటే ఇంటింటి సర్వే పారదర్శకంగా జరగాలన్నారు. సర్వే నిర్వహించే ఎన్యూమరేటర్లకు ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే సాధ్యమవుతుందన్నారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా సర్వే చేపట్టేందుకు నిజాయితీతో సమాచారమివ్వాలని సూ చించారు. ఏ ఒక్క ఇంటి వివరాలు కూడా మర్చిపోకుండా, ప్రతి ఇంటిలో నివసించే అందరి సమాచా రం సేకరించి, నమోదు చేయాలన్నారు.
జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, సర్వేకు అంద రూ సహకరించాలని కోరారు. ప్రభుత్వాదేశాలకనుగుణంగా జిల్లా యంత్రాంగం ముందుకెళ్తుందని, బీసీల రిజర్వేషన్ల అమలుకు సంబంధించి వారి స్థితిగతులపై సమగ్ర సమాచారం సేకరించేందుకే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీవో కే మహేశ్వర్, బీసీడీవో అనిల్ ప్రకాశ్, బీసీ కార్పొరేషన్ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.