రాజన్న సిరిసిల్ల, జూలై 14 (నమస్తే తెలంగాణ) / వేముల వాడ : సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. రైతుల పొలాలకు నీళ్లడిగితే.. కేటీఆర్, హరీశ్ రావు రక్తాన్ని పంటలకు చల్లాలనడంపై ఆగ్రహిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో రక్తదానాలు చేసి నిరసనలు తెలిపారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో పెద్ద సంఖ్యలో నాయకులు రక్తదానం చేశారు. అనంతరం ఆ రక్తం ప్యాకెట్లు పట్టుకొని.. ‘ఇదిగో మా రక్తం ఇస్తున్నాం.. పంటలకు నీళ్లు ఇవ్వండి’ అంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేములవాడలోనూ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు నివాసంలో కార్యకర్తలతో కలిసి ఆయన రక్తం దానం చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల నాయకులు మాట్లాడారు.
సాగునీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నీళ్లివ్వాలని అడిగితే కేటీఆర్, హరీశ్‌రావును కోసి రక్తం పంటలకు చల్లితే పండుతాయని ఆయన వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సముచితమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. ఆ వ్యాఖ్యలు రైతులను, ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా ఉన్నాయన్నారు. రైతుల పంటలకు కావాల్సింది రక్తం కాదని, సాగునీరని స్పష్టం చేశారు. మీరడిగినట్టు మా మా రక్తం తీసుకొని రైతన్నకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లను ప్రారంభించాచి రైతులపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.