జగిత్యాల, ఏప్రిల్ 28: రజతోత్సవ సభకు తరలివచ్చిన అశేష జనవాహిని చూసి కాంగ్రెస్ నాయకులు, మంత్రులకు మతిపోయి గాలి మాటలు మాట్లాడుతున్నారని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు. రజతోత్సవ సభ కుంభమేళాను తలపించడంతో కాంగ్రెస్ నాయకులు ఆగమైతున్నారని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ నాయకులతో కలిసి ఆమె మాట్లాడారు. సభను విజయవంతం చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిందన్నారు. కేసీఆర్ ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపించిందన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నవారు తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. రజోత్సవ సభను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ పార్టీ పట్టణాధ్యక్షుడు గట్టు సతీశ్, జగిత్యాల రూరల్, అర్బన్, రాయికల్ పట్టణ, మండలాధ్యక్షులు ఆనంద్‌రావు, తుమ్మ గంగాధర్, అనిల్, మల్లేశ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనందరావు, రాయికల్ కోఆర్డినేటర్ శ్రీధర్, పట్టణ ఉపాధ్యక్షుడు వొల్లెం మల్లేశం, నాయకులు శీలం ప్రవీణ్, గంగారెడ్డి, రిజ్వాన్, యూత్ నాయకులు ప్రతాప్, ప్రణయ్, మనోజ్, వర్షిత్, తదితరులు ఉన్నారు.
కుంభమేళాను తలపించింది
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 28: బీఆర్ఎస్ రజతోత్సవ సభ కుంభమేళా, సమ్మక్క-సారలమ్మ జాతరను తలపించిందని బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకత్వంలో సభను దిగ్విజయం చేసుకున్నామన్నారు. సోమవారం సిరిసిల్లలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రజతోత్సవ సభ భారీ సక్సెస్ కావడం, అనుకున్న దానికంటే భారీ సంఖ్యలో జనం తరలిరావడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతున్నదని విమర్శించారు. సభకు వచ్చిన జనాన్ని చూసి మతిభ్రమించి కాంగ్రెస్ మంత్రులు, నాయకులు ఆగమేఘాల మీద ప్రెస్మీట్లు పెడుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అవసాన స్థితిలో ఉన్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సాధనలో భాగంగా దేశంలోని దాదాపు 32పార్టీలను ఒప్పించి మద్దతు కూడగట్టిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందే తెలంగాణ రాష్ట్రం కోసం అని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ఉండకపోయి ఉంటే.. రేవంత్‌రెడ్డి ఎక్కడ ఉండేవాడో కాంగ్రెస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆంధ్ర పాలకు లు చంద్రబాబు, యనమల రామకృష్ణుడు బూట్లు తుడిసిన నాయకుడు రేవంత్‌రెడ్డి క్యాబినెట్లో పని చేస్తున్న మీరు కేసీఆర్‌పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని, మళ్లీ ఆయన పాలన కోసం ఎదురుచూస్తున్నారని ఉద్ఘాటించారు. రాబోయే రోజుల్లో సభ్యత్వ నమోదు నిర్వహించి, నూతన కమిటీల ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిపక్ష హోదా లో ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తామన్నారు. సమావేశం లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, బీఆర్ఎస్ తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజ న్న, నాయకులు గుగులోత్ సురేశ్‌నాయక్, కుంబాల మల్లారెడ్డి, మాట్ల మధు, ఒజ్జల అగ్గిరాములు, జక్కుల యాదగిరి, ఇమ్మనేని అమర్‌రావు, గుండు ప్రేమ్‌కుమార్, సయ్యద్ అఫ్రోజ్, తదితరులు పాల్గొన్నారు.
ఎన్ని కుట్రలు పన్నినా సభను ఆపలేకపోయారు
గంగాధర, ఏప్రిల్ 28: అరచేతిని అడ్డుపెట్టి సూర్యకిరణాలను ఆపలేనట్టు.. కా్రంగెస్ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఆపలేకపోయారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభ లక్షలాది మందితో జనసముద్రాన్ని తలపించిందన్నారు. తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ మాత్రమేనని ప్రజలు గ్రహించారని.. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై అభిమానంతో సభకు తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్‌ను చుద్దామని, ఆయన ప్రసంగాన్ని విందామని లక్షలాదిగా తరలివచ్చిన జనంతో సభాస్థలం మహాకుంభ మేళా, సమ్మక్క-సారలమ్మ జాతరను తలపించిందన్నారు. కాంగ్రెస్ పాలనతో అయోమయంలో ఉన్న రాష్ట్ర ప్రజలకు.. రజతోత్సవ సభతో నేనున్నానంటూ కేసీఆర్ భరోసా కల్పించారని గుర్తు చేశారు. సభ అట్టర్‌ప్లాప్ అంటూ కాంగ్రెస్ మంత్రులు విష ప్రచారానికి దిగారని, సభను అడ్డుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నించారని విమర్శించారు. లారీలను అడ్డుపెట్టడం, ఆర్టీఏ, పోలీస్ అధికారులతో బెదిరించారన్నారు. కాంగ్రెస్ మంత్రులు, నాయకులు కేసీఆర్‌పై అసత్య ప్రచారాన్ని మానుకొని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
అన్నివర్గాల్లో నూతనోత్సాహం
మంథని, ఏప్రిల్ 28: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఇచ్చిన పవర్ఫుల్ స్పీచ్‌తో అన్నివర్గాల ప్రజల్లో నూతనోత్సాహం వచ్చిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ హర్షం వ్యక్తం చేశారు. సభకు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రజతోత్సవ సభకు ప్రజలు హాజరుకావద్దనే దురుద్దేశంతో కాంగ్రెస్ సర్కారు.. ఎన్ని ఆటంకాలు కలిగించినా నలుమూలల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా భారీసంఖ్యలో తరలివచ్చారన్నారు. మంథని నియోజకవర్గం నుంచి ఎక్కువగా హాజరుకావద్దని శతవిధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ.. పెద్దసంఖ్యలోనే ప్రజలు హాజరయ్యారన్నారు. తెలంగాణ ప్రజానీకంలో కేసీఆర్ స్పీచ్‌తో నూతనోత్సాహం వచ్చిందన్నారు. వరంగల్‌లో జరిగిన రజతోత్సవ సభను విజయవంతం చేసిన ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని ప్రకటించారు.
మీ అభిమానం ఇలాగే ఉండాలి
వేములవాడ, ఏప్రిల్ 28: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లో చిరస్థాయిలో నిలిచిపోయాయని చెప్పడానికి ఎల్కతుర్తిలో రజతోత్సవ సభకు తరలివచ్చిన జనసందోహమే నిదర్శనమని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తూ.. ప్రజా సమస్యలపై పాలకులను నిలదీస్తూ ముందుకెళ్లేందుకు మీ ఆదరాభిమానాలు ఇలానే ఉండాలన్నారు.
సభకు తరలివచ్చిన ప్రతి ఒకరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న విశ్వాసం, అభిమానంతో సభకు పెద్ద ఎత్తున తరలివచ్చారన్నారు. కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చిరస్థాయిలో నిలిచిపోయాయన్నారు. సభకు తరలివచ్చి విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.