ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కింద ఎకరాకు పెట్టుబడి సాయం రూ.15వేలు ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. అనేక వాగ్దానాలు చేసి, మాటలతో మభ్యపెట్టి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ఆరో గ్యారెంటీ కింద ఇచ్చిన హామీని నెరవేర్చాలని, లేదంటే తన పదవికి రాజీనామా చేయాలని హెచ్చరించారు. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ మోసంపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల శ్రేణులు ధర్నా చేశారు. మానకొండూర్ మండల కేంద్రంలో పల్లెమీద చౌరస్తాలో జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పాల్గొనగా, గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో చేపట్టిన నిరసనకు పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను బూరుగుపల్లిలోని తన నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ అంటేనే మోసం
మానకొండూర్రూరల్, జనవరి 5: ఆరో గ్యారంటీ అయిన రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సాయం ఇవ్వాల్సిందేనని మానకొండూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో పల్లెమీద చౌరస్తాలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని రైతుల తరపున నిరసన, ధర్నా కార్యక్రమాన్ని చేపట్టగా, ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ ఇచ్చిన ప్రతి మాటా తప్పుతూ, ప్రతి హామీని విస్మరిస్తున్నారని, కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అని మళ్లీ మళ్లీ నిరూపించుకున్నదని మండిపడ్డారు. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ.12 వేలు మాత్రమే ఇస్తామంటూ మాట మార్చడం సరికాదన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, శంకరపట్నం మండల అధ్యక్షుడు గంట మహిపాల్, తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు రావుల రమేశ్, నియోజక వర్గంలోని బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
– మానకొండూర్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి
రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి: మాజీ ఎమ్మెల్యే సుంకె
గంగాధర, జనవరి 5: తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మధురానగర్ చౌరస్తాలో తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి బయలుదేరుతున్న ఆయనను బూరుగుపల్లిలోని ఆయన నివాసం వద్ద పోలీసులు బలవంతంగా హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
రైతుల తరపున ప్రజాస్వామ్య యుతంగా పోరాటం చేయడానికి వెళ్తున్న తనను నిర్భందించడం దుర్మార్గమని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం నడుస్తున్నదా..? నిర్భంద ప్రభుత్వం నడుస్తోందా..? చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏం సాధించారని కాంగ్రెస్ నాయకులు సంబురాలు, పాలాభిషేకాలు చేస్తున్నారని, ఇచ్చిన హామీలను తప్పినందుకా ?, రైతు భరోసా ఇవ్వనందుకా ?, రుణమాఫీని పూర్తిగా అమలు చేయనందుకా ?, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇవ్వనందుకా..?, కాంగ్రెస్ నాయకులు ఎందుకు సంబురాలు చేసుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గ్రామాల్లోకి వస్తే ప్రజలు తరిమికొడతారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ధర్నాపై పోలీసు నిర్బంధం
రైతు భరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలని మధురానగర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాపై పోలీసుల నిర్బంధం కొనసాగింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యక ర్తలను అడుగడుగునా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బలవంతంగా అరెస్టు చేసి, ఠాణాకు తరలించారు. హోటల్లో కూర్చొని టీ తాగుతున్న బీఆర్ఎస్ నాయకులను సైతం వదలకుండా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తాము ఏం తప్పు చేశామని, రైతుల తరపున పోరా టం చేయడమే తాము చెసిన తప్పా అని నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమకు కేసులు, జైల్లు కొత్తకాదని, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రైతుల పక్షాన మరో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కాగా, నాయకులను సాయంత్రం దాకా ఠాణాలో ఉంచుకొని సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఇక్కడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సాగి మహిపాల్‌రావు, మామిడి తిరుపతి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, మాజీ సర్పంచులు కంకణాల విజేందర్‌రెడ్డి,మడ్లపెల్లి గంగాధర్, వేముల దామోదర్, యండీ నజీర్, రామిడి సురేందర్, ముక్కెర మల్లేశం, ఆదిమల్లు, నాయకులు మధుసూదన్, మధుసూదన్‌రెడ్డి, అఖిల్ ఉన్నారు.