కోల్ సిటీ, సెప్టెంబర్ 30: ‘మీలో ఉన్న ఈ ప్రశ్నించే తత్వం అందరిలో రావాలి.. అప్పుడే రామగుండంలో విధ్వంస పాలన ఆగాలి.. పదవి లేకపోయినా రామగుండం నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతున్న మీ నిజాయితీ నిజంగా గ్రేట్.. ఒక మహిళగా అవినీతిపై మీరు చేస్తున్న యుద్ధం ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలి.. ఇలా ప్రతి ఒక్కరు నిజాయితీగా అక్రమాలకు పాల్పడేవారిని ప్రశ్నించే రోజు రావాలి’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, వీహెచ్ఆర్ ఫౌండేషన్ అధినేత వ్యాల్ల హరీష్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు మంగళవారం రామగుండం నగర పాలక సంస్థ 25వ డివిజన్ మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఇంటికి వెళ్లిన ఆయన రామగుండం నగర పాలక సంస్థలో జరుగుతున్న అవినీతి వ్యవహారంపై అడిగి తెలుసుకున్నారు. పదవి లేకపోయినా నగర పాలక సంస్థలో జరుగుతున్న అనేక కుంభకోణాలను గతంలో విజిలెన్స్ కమిషనర్ కు ధైర్యంగా ఫిర్యాదు చేసి అక్రమాలకు కళ్లెం వేయడమే గాకుండా ఇటీవల నగర పాలక సంస్థలో రూ.13 కోట్లతో నిర్వహించిన యూజీడీ పనులకు సంబంధించిన టెండర్లలో అధికారులు, కాంట్రాక్టర్లు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై అవకతవకలకు పాల్పడ్డారని ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం, సీడీఎంఏకు ఫిర్యాదు చేయడం తన దృష్టికి వచ్చిందనీ, ఇలా సమాజంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించే మీకు మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రామగుండం కార్పొరేషన్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమనీ, అప్పుడు వీరి వ్యవహారం అంతా బయట పెడుతామని భరోసా ఇచ్చారు. ఈ ప్రాంత అభివృద్ధిపై తమవంతుగా పాలకులపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. పదవులు శాశ్వతం కాదనీ, ఈ ప్రాంత అభివృద్ధిపై పాలకులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఉన్నారు. అనంతరం హరీష్ రెడ్డిని మాజీ కార్పొరేటర్ సుమలత రాజు దంపతులు శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.