Harish Rao | ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లలో స్కాంలు కొనసాగుతున్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి స్కాంలు చేస్తున్నాడని అన్నారు. అందులో సీఈ, ఈఎన్సీ అందరూ రిటైర్డ్ వాళ్లే ఉన్నారని తెలిపారు.
నాలుగైదు స్కూళ్లను ప్యాకేజీ చేసి అన్యాయాలకు తెర తీశారని హరీశ్‌రావు మండిపడ్డారు. వీటి టెండర్లలో రూ.1000 కోట్ల స్కాం జరిగిందని అన్నారు. ఇందులో బీజేపీ వారికి ఒకటి, రెండు ప్యాకేజీలు దక్కాయని తెలిపారు. సమయం వచ్చినప్పుడు ఆ వివరాలన్నీ బయటపెడతామని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 76 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు పూర్తి చేయగా, అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న 26 నియోజకవర్గాలకు ఇవ్వలేదని హరీశ్‌రావు తెలిపారు. కక్షపూరితంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్కూళ్లు మంజూరు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, అలాగే కొందరు బీజేపీ ఎమ్మెల్యేలకు మాత్రం స్కూళ్లు కేటాయించారని తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో భారీ అవినీతి జరుగుతోందని హరీశ్‌రావు అన్నారు. కాంట్రాక్టర్లు ఆర్గనైజ్డ్ రింగ్ గా అయ్యి పనులను పంచుకుంటున్నారని అన్నారు. 76 స్కూళ్లకు సంబంధించిన ప్రతి టెండర్ కి ఎక్సెస్ ధర కోట్ చేసి దక్కించుకున్నారని తెలిపారు. టెండర్లలో కనిష్టంగా 4.59% నుంచి గరిష్టంగా 4.96% ఎక్సెస్‌తో, నిబంధనల ప్రకారం 5% దాటకుండా పక్కా ప్లాన్‌తో కొల్లగొట్టారని విమర్శించారు. ఒక్కో స్కూలుకు రూ. 250 కోట్లు కేటాయించగా, అందులో సివిల్ వర్క్స్ కోసమే సుమారు రూ. 150 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. 76 స్కూళ్లకు సంబంధించి ప్రభుత్వ అంచనా వ్యయం రూ. 10,199.54 కోట్లు కాగా, కాంట్రాక్టర్లు దాన్ని రూ. 10,693.55 కోట్ల ఎక్సెస్‌తో దక్కించుకున్నారని అన్నారు. అంటే కేవలం ఈ టెండర్ల ద్వారా సుమారు రూ. 494 కోట్లు ప్రజాధనాన్ని అదనంగా దోచిపెడుతున్నారని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ తో పాటు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గం మధిరల్లో అత్యధికంగా 4.95% ఎక్సెస్ ధరకు టెండర్లు కేటాయించడం పలు అనుమానాలకు కలిగిస్తున్నాయని హరీశ్‌రావు అన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నియోజకవర్గంలో 4.95 ఎక్సెస్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం హుజూర్ నగర్ లో 4.95 ఎక్సెస్ కు టెండర్ ఇచ్చారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం హుస్నాబాద్ లో 4.95 ఎక్సెస్ కు టెండర్ ఇచ్చారని.. మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గం కొల్లాపూర్ లో 4.77 ఎక్సెస్ కు టెండర్ ఇచ్చారని చెప్పారు. మంత్రి కొండా సురేఖ నియోజకవర్గం వరంగల్ ఈస్ట్ లో 4.99 ఎక్సెస్ కు టెండర్ ఇచ్చారన్నారు. మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గం నల్గొండలో 4.87 ఎక్సెస్ కు టెండర్ ఇచ్చారన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గం ఖమ్మంలో 4.95 ఎక్సెస్ కు టెండర్ ఇచ్చారని తెలిపారు. మంత్రి సీతక్క నియోజవర్గం ములుగులో 4.95 ఎక్సెస్ కు టెండర్ ఇచ్చారని పేర్కొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ నియోజకవర్గం ఆంథోల్ లో 4.99 కు ఎక్సెస్ టెండర్ ఇచ్చారని.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నియోజకవర్గం వికారాబాద్ లో 4.89 కు ఎక్సెస్ టెండర్ ఇచ్చారని.. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియోజకవర్గం మంథనిలో 4.89 కు ఎక్సెస్ టెండర్ ఇచ్చారని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి వాడుతున్న వాహనం KLSR కంపెనీ పేరు మీదనే ఉంటుందని హరీశ్‌రావు తెలిపారు. ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంతో పాటు ఏకంగా 9 స్కూళ్ల టెండర్లను ఈ ప్రభుత్వం అదే KLSR సంస్థకు కట్టబెట్టిందని పేర్కొన్నారు. మంత్రుల నియోజకవర్గాల్లోనే ఎక్కువ ధరకు టెండర్లు ఖరారు కావడం ఈ కుంభకోణానికి నిదర్శనమని చెప్పారు.
నాడు కేసీఆర్ పదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఏనాడూ రాజకీయ పక్షపాతం చూపలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు సమానంగా ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. మిషన్ కాకతీయ మొదటి దశ నుంచే, మిషన్ భగీరథ, బీసీ,మైనార్టీ గురుకులాలు ఇలా ఏ పథకమైనా 119 నియోజకవర్గాలకు సమానంగా ఇచ్చారని అన్నారు మెడికల్ కాలేజీలను అన్ని జిల్లాలకు ఇస్తూ, నేటి కాంగ్రెస్ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు నియోజకవర్గానికి కూడా ఇచ్చామని తెలిపారు
దళిత బంధు లాంటి గొప్ప పథకాన్ని ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిర చింతకాని నుంచే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఘనత కేసీఆది అని హరీశ్‌రావు కొనియాడారు. అభివృద్ధిని సమానంగా చూసిన బీఆర్ఎస్ ఎక్కడ? కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారన్న అక్కసుతో 26 నియోజకవర్గాలకు స్కూళ్లను ఆపేసిన మీరెక్కడ? అని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంలో జరిగిన ఈ వందల కోట్ల టెండర్ల కుంభకోణంపై శాసనసభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని అన్నారు. నా దగ్గర ఈ స్కామ్ కు సంబంధించి ఇంకా పూర్తి ఆధారాలు, వివరాలు ఉన్నాయని.. వాటన్నింటినీ అసెంబ్లీ సమావేశాల్లో సభ సాక్షిగా బయటపెడతానని స్పష్టం చేశారు.