Manish Malhotra Mother | ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి సావిత్రి మల్హోత్రా (90) వృద్ధాప్య సమస్యల కారణంగా ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇక సావిత్రి మరణవార్త తెలిసిన బాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మనీష్ మల్హోత్రా నివాసానికి చేరుకుంటున్నారు.
కరణ్ జోహార్, షబానా అజ్మీ, బోనీ కపూర్, సోఫీ చౌదరి వంటి సినీ ప్రముఖులు మనీష్‌ను పరామర్శించి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఫ్యాషన్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న మనీష్ మల్హోత్రాకు తన తల్లి అంటే ఎంతో ఇష్టమని, ఆమె మరణం ఆయనకు తీరని లోటని సన్నిహితులు పేర్కొంటున్నారు. సావిత్రి మల్హోత్రా అంత్యక్రియలు ముంబైలోని శాంతాక్రజ్ స్మశానవాటికలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్నాయి.