కరీంనగర్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాళేశ్వరం కూలిపోయిందని, రూ.లక్ష కోట్లు గంగలో పోశారని, ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి హితవుపలికారు. ప్రాజెక్టు సంబంధించిన వాస్తవాలను ప్రజల ముందుంచాలన్న లక్ష్యంతో ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల కాళేశ్వరం ప్రాజెక్టు స్టడీ టూర్ శనివారం సాయంత్రంతో ముగిసింది.
ముందుగా మేడిగడ్డ బ్యారేజీ నుంచి ప్రారంభమైన టూర్.. అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, నంది మేడారం రిజర్వాయర్, గాయత్రీ పంపుహౌస్, అన్నపూర్ణ జలాశయం, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల్ల రిజర్వాయర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా.. పలు చోట్ల రైతులతో మాట్లాడిన బృందం.. కాంగ్రెస్ చెపుతున్న అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను వివరించింది. కాళేశ్వరం కూలిపోయిందని, రూ.లక్ష కోట్లు వృథా అయ్యాయయని, ఒక్క చుక్క నీరు రైతులకు ఇవ్వలేదంటూ.. కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని రైతులకు ఆధారాలతో సహా వివరించింది.
కాళేశ్వరం కూలిపోయి ఉంటే.. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి నంది రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి గాయత్రీ పంపుహౌస్ ద్వారా మధ్యమానేరు ప్రాజెక్టుకు, అక్కడి నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌కు 12 రోజులుగా మూడు పంపులతో 9 వేల క్యూసెక్కులు ఎలా ఎత్తిపోస్తున్నదని ప్రశ్నించింది. నిజంగా కాంగ్రెస్ పాలకులు చెప్పినట్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్థకం అయి ఉంటే.. నీటిని ఎలా ఎత్తిపోస్తున్నదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి నుంచి కొండపోమ్మ సాగర్‌వరకు ఎత్తిపోస్తున్న నీరు..
కేసీఆర్ ఏర్పాటు చేసిన మోటర్లు, పంపుహౌస్‌ల ద్వారా కాదా?, ఈ రిజర్వాయర్లను కట్టింది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కాదా? అంటూ నిలదీసింది. ఎత్తిపోస్తున్న నీటిని రైతులకు ఇవ్వకుండా సీఎం, నీటి పారుదల శాఖ మంత్రి తాగేస్తారా?, కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదంటూ అసత్య ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు ఎత్తిపోస్తున్న నీటిని రిజర్వాయర్‌లోనే స్టాక్పెడుతారా? వాటిని రైతులకు ఇచ్చి సద్వినియోగం చేయరా? అంటూ చురకలంటించింది.
కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ ఒక్కటే కాద ని, 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంపుహౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 98 కిలోమీటర్ల ప్రెజర్మెయిన్స్, 141 టీఎంసీల స్టోరేజీ సామర్థ్యం, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయడం, మొత్తంగా ఏటా 240 టీఎంసీల నీటి వినియోగం అంటూ..
కేసీఆర్‌తోపాటు బీఆర్ఎస్ పదే పదే చెబుతున్నా ప్రజలు అర్థం చేసుకున్నారే గానీ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి, పాలకులకు అర్థం కావడం లేదని ఎద్దేవా చేసింది. ఈ విషయాలపై కాంగ్రెస్ పాలకులను ప్రశ్నించాలని సూ చించింది. స్టడీ టూర్లో రాకేశ్‌రెడ్డితోపాటు సాగునీటి రంగ నిపుణులు డీ రాము, పురుషోత్తంయాదవ్, బీఆర్ఎస్ యూత్ నాయకులు చదువు అఖిల్‌రెడ్డి, పవన్‌గౌడ్, సోషల్‌మీడియా వారియర్స్ పాల్గొన్నారు.
అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు
కాకతీయ రాజులు గొలుసుకట్టు చెరువులు నిర్మించి వ్యవసాయ రంగానికి దండుగా నిలిస్తే.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నదులకు నడక నేర్పడమే కాదు.. గొలుసుకట్టు రిజర్వాయర్లను నిర్మించారు. సమైక్య రాష్ట్రంలో నిర్వీర్యమైన వ్యవసాయరంగానికి స్వరాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ ఊపిరి పోశారు. ఇందుకోసం దేశం యావత్తు గర్వపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి వ్యవసాయరంగాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా తీర్చిదిద్దారు.
దానిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టుపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. ఎల్లంపల్లి భూసేకరణకు రూ.300 కోట్లపైగా ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా?, ఎల్లంపల్లిని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి అక్కడి నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా ఏర్పాటు చేసిన పంపులు, రిజర్వాయర్ల ద్వారా నీటిని ఎత్తిపోసి హైదరాబాద్ వరకు నీటిని తీసుకొచ్చింది వాస్తవం కాదా? సమాధానం చెప్పాలి. ఇక ముందైనా అసత్య ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం మానుకోవాలి. – ఏనుగుల రాకేశ్రెడ్డ్డి, బీఆర్ఎస్ నేత