హుజూరాబాద్, ఏప్రిల్ 20: ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని, అప్పుడైనా, ఇప్పుడైనా అభివృద్ధే తమ ఎజెండా అని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి హుజూరాబాద్ పట్టణంలో వాకర్స్‌తో మార్నింగ్‌వాక్‌లో, ఇందిరానగర్‌లోని ప్రజలతో వినోద్‌కుమార్ ముచ్చటించారు. ఎంపీగా అవకాశం ఇస్తే గతంలో కంటే కరీంనగర్‌ను మరింత అభివృద్ధి చేస్తానని, పార్లమెంట్లో తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగురవేస్తానని స్పష్టం చేశారు.
కాజీపేట, హసన్‌పర్తి, హుజూరాబాద్ మీదుగా కరీంనగర్‌కు రైల్వే మార్గం ఏర్పాటు చేయమని అప్పుడే కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చానని తెలిపారు. దానిమీద కేంద్ర ప్రభుత్వం ఆనాడు సుముఖంగా లేకపోవడంతో ఆగిపోయిందని, ఇప్పుడు ఆ రైలు మార్గం పూర్తికి కృషి చేస్తానని చెప్పారు. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాలను ట్విన్ సిటీస్‌గా మారుస్తానని పేర్కొన్నారు. కేంద్రం నుంచి నియోజకవర్గానికి రావాల్సిన నిధులను తప్పక తీసుకువస్తానని, హుజూరాబాద్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి పని చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో వినోద్‌కుమార్ తెలంగాణ ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఎంపీగా ఉన్నప్పుడు ఉప్పల్ బ్రిడ్జి, బిజిగిరి షరీఫ్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. హుజూరాబాద్ అభివృద్ధిలో భాగంగా పట్టణంలోని గ్రౌండ్‌ను మినీ స్టేడియంగా మార్చేందుకు రూ.పది కోట్లు మంజూరు చేశారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపే ప్రయత్నం చేస్తే మరో ఉద్యమం మొదలుపెట్టక తప్పదని ఎమ్మెల్యే హెచ్చరించారు. బండి సంజయ్ ఎంపీగా ఉండి ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒకసారి కూడా హుజూరాబాద్ నియోజకవర్గానికి రాలేదన్నారు.
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధిలో పురోగమనం వైపు అడుగులు వేస్తే కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు పోతున్నదని పేర్కొన్నారు. కరీంనగర్ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వినోద్‌కుమార్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తకళ్లపల్లి రాజేశ్వరరావు, బీఆర్ఎస్ హుజూరాబాద్ పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
హుజూరాబాద్‌టౌన్, ఏప్రిల్ 20: పార్లమెంట్ వద్ద రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేదర్ విగ్రహ ఏర్పాటు కోసం బోయినపల్లి వినోద్‌కుమార్ ఎంపీగా ఉన్న సమయంలో చేసిన కృషి గొప్పదని కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు సొల్లు బాబు కితాబిచ్చారు. శనివారం హుజూరాబాద్ బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా సొల్లు బాబు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వినోద్‌కుమార్‌కు పరిచయం చేయగా, బాబు ఈ విధంగా స్పందించారు. ‘అంబేదర్ విగ్రహం ఏర్పాటు కోసం మీరు రాసిన రచనలు చదివా, మీరు అంబేదర్ విగ్రహం కోసం ఎంతో కృషి చేసిన మాట వాస్తవం. ఇది పార్టీలకు అతీతంగా అంబేదర్ వాదులు గుర్తిస్తారు. పార్టీలకతీతంగా ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోక తప్పదు సార్’.. అనడంతో అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు మరీ వెంటనే కండువా కప్పుకో అనడంతో నవ్వులు విరిశాయి.