కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 17 : మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు చేశాయని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ధ్వజమెత్తారు. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అన్న విషయం మరిచిపోయారని, అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీల్లో బీజేపీ ఓడిపోయిన విషయం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే నగర మేయర్ ఎన్నిక విషయంలో కుట్రలు చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని, మంత్రిగా కరీంనగర్‌కు ఏం చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ తప్ప మిగిలిన మున్సిపాలిటీలు ఆయనకు అవసరం లేదా..? అని ప్రశ్నించారు.
నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేయర్ ఎన్నికల అనంతరం సంజయ్ ఒక్క నిమిషం కూడా అభివృద్ధి గురించి ప్రస్తావించలేదని, తీవ్ర అసహనంతో మాట్లాడారని విమర్శించారు. అసలు బీజేపీ అభ్యర్థిని మేయర్ చేయాలన్న ఆలోచన కూడా ఆయనకు లేదని, అందుకే మెజార్టీ సీట్లు రాకపోయినా స్వతంత్రులతో కనీసం సంప్రదింపులు కూడా చేయలేదన్నారు. క్యాంపు నుంచి కూడా కార్పొరేటర్లు పోయేలా డ్రామాలు చేశారన్నారు. క్యాంపులో ఉన్న కార్పొరేటర్లు ఆయనకు తెలియకుండా బయటకు ఎలా వెళ్లిపోయారని ప్రశ్నించారు. కేవలం తన తప్పిదాలను కప్పిపుచ్చుకొని బీఆర్ఎస్ను బద్నాం చేసేందుకే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు.
రాష్ట్రంలో 18 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలిచిందని, సంజయ్ ఒక్క కార్పొరేషన్ గెలిచి ఆగం అవుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై నర్సాపూర్, కాగజ్‌నగర్, మెట్పల్లి, మెదక్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ను అడ్డుకున్నారని, అయినా తాము ఎక్కడా ఆగం కాలేదని, వారి కుట్రలను తిప్పికొట్టామని స్పష్టం చేశారు. మిగిలిన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన బీజేపీ వార్డు సభ్యులను సస్పెండ్ చేసే దమ్ము సంజయ్‌కి ఉన్నదా..? అని నిలదీశారు. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్కు సంపూర్ణ మెజార్టీ ఉన్నా.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై ఎన్నికలను వాయిదా వేసేలా చేశాయని ఆరోపించారు.
కార్పొరేషన్‌ను గెలిచి ప్రధాని మోదీకి గిప్ట్ ఇచ్చామని చెప్పుతున్న బండి, కరీంనగర్‌కు రిటర్న్ గిఫ్ట్ తేకపోతే ప్రజలు అసలు కథ చెబుతారని హెచ్చరించారు. ఇప్పుడే ఆట మొదలైందని, బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ ఇప్పుడే బ్యాటింగ్‌కు వచ్చారని, ఇంకా ముందు ఆట ఉందన్నారు. ఇప్పటికైనా ప్రజలను తప్పుదారి పట్టించేలా కట్టుకథలు అల్లడం మానుకోవాలని, ఎన్నుకున్న ప్రజల సమస్యల పరిష్కారం, నగరాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ పొన్నం అనిల్, నాయకులు రాజేందర్రావు, ఉమాపతి, రేణుక తదితరులు పాల్గొన్నారు.