మెట్పల్లి రూరల్, ఏప్రిల్ 10: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్దసంఖ్యలో తరలి వెళ్దామని, సభను సక్సెస్ చేసి మరోసారి మన సత్తాచాటుదామని ఆ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు. మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులోని కేఎన్రెడ్డి గార్డెన్స్‌లో గురువారం బీఆర్ఎస్ కోరుట్ల నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దీనికి విద్యాసాగర్‌రావు ముఖ్య అతిథిగా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ ప్రజల సంక్షేమానికి పాటుపడింది, పాటుపడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. కేసీఆర్ హయాంలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందాయని, నిరంతర విద్యుత్, సాగు, తాగునీటికి ఇబ్బందుల్లేకుండా పాలన సాగిందని గుర్తు చేశారు. కానీ, కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో అస్తవ్యస్తంగా మారిందని, సాగునీరు లేక పంటలు ఎండిపోయే దుస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం గాడిన పడుతుందని స్పష్టం చేశారు.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించిన సభకు కోరుట్ల నియోజకవర్గం నుంచి ఐదువేల మందిమి కదులుదామని, వంద బస్సుల్లో తరలివెళ్దామని పిలుపునిచ్చారు. అనంతరం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ, వరంగల్ సభకు నియోజకవర్గం నుంచి మూడు వేలకు తగ్గకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని కొనియాడారు.
కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందితే, ఏడాది కాంగ్రెస్ పాలనలో పదేళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. కాగా, రజతోత్సవ సభ ఖర్చుల నిమిత్తం మల్లాపూర్ మండలం ముత్యంపేట ఆటో కార్మికులు 5వేలు విరాళంగా అందజేశారు. అలాగే మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మల్లాపూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు సైతం సభ ఖర్చుల కోసం విరాళాలను అందించారు.
ఈ సమావేశంలో మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, మెట్పల్లి మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ చంద్రశేఖర్‌రావు, ఇబ్రహీంపట్నం, కోరుట్ల పార్టీ మండలాధ్యక్షులు ఎలాల దశరత్‌రెడ్డి, దారిశెట్టి రాజేశ్, సందిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బొట్టుపెట్టి ‘సభ’కు ఆహ్వానం
ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 10: బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం నాయకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం పదిరలో సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ కుంబాల వజ్రవ్వ ఇంటింటా బొట్టుపెట్టి సభకు రావాలని ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి వారు సంతోషం వ్యక్తం చేశారు. వారి వెంట బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కుంబాల లక్ష్మారెడ్డి, యూత్ అధ్యక్షుడు కామిడి శ్రీకాంత్, ఊరడి ఎల్లయ్య, రాజం, మంజుల, గెంటె లింగయ్య, భీమ్‌రెడ్డి, మధు, సాయికృష్ణ, బాలయ్య తదితరులు ఉన్నారు.