వేములవాడ, మే 21: రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో ఆదుకునేవారు కరువయ్యారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు ఆవేదన చెందారు. రైతుల సమస్యలు గాలికి వదిలేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అమెరికా, ఆది శ్రీనివాస్ దుబాయ్ టూర్లలో బిజీగా ఉన్నారని ధ్వజమెత్తారు. వడ్ల కొనుగోళ్లలో జాప్యంతో రైతులు నిద్రాహారాలు మాని సెంటర్లలో పడిగాపులు గాస్తుంటే.. వారేమో విదేశాల్లో షికార్లు చేయడం విడ్డూరమన్నారు. వేములవాడ సహకార సంఘం పరిధిలోనే 60 వేల క్వింటాళ్ల వడ్ల నిల్వలు, 10 వేల తూకం వేసిన బస్తాలు ఉన్నాయని చెప్పారు. మళ్లీ అకాల వర్షాలు వస్తే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వేములవాడలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఏర్పడిన కరువుతో ఒక్క రుద్రంగి నుంచే 2వేల మంది గల్ఫ్ దేశాలకు వెళ్లారని గుర్తు చేశారు. కానీ, స్వరాష్ట్రంలో పుష్కలంగా సాగునీరందించడంతో గల్ఫ్ నుంచి వాపస్ వచ్చి వ్యవసాయం చేసుకున్నారని తెలిపారు. కానీ, రేవంత్ ప్రభుత్వం నిర్వాకంతో మళ్లీ ఈ ప్రాంతం కరువుకోరల్లో చిక్కుకొనే ముప్పు ఉందని, ఈ ప్రాంత యువత మళ్లీ గల్ఫ్ బాట పట్టే విధంగా చేస్తున్నట్టు కనిపిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు. ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో మంత్రి పొన్నం అమెరికాకు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దుబాయ్‌కి ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్, కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, జోగని శంకర్, సిరిగిరి రామచందర్, నరాల శేఖర్, గోలి మహేశ్, నాయకులు కమలాకర్ రెడ్డి, వెంగళ శ్రీకాంత్, ఈర్లపల్లి రాజు, సందీప్, మైలారపు రాము ఉన్నారు.
ముంపు గ్రామాలకు పరిహారం ఎప్పుడిస్తరు?
ఎన్నికల సమయంలో ముంపు గ్రామాలకు 5.4 లక్షలు ఇస్తామని ఆది శ్రీనివాస్ నమ్మించిండు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరిచిపోయిండు. చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డితో ప్రకటన చేయించాలి. పరిహారం కోసం అక్కడి ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నరు.
– చల్మెడ లక్ష్మీనరసింహారావు