కరీంనగర్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాటి సమైక్య ప్రభుత్వ హయాంలోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జల హక్కుల కోసం ఉద్యమించారు. ప్రధానంగా ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడారు. నిజానికి ఉత్తర తెలంగాణకు వరప్రదాయని ఎస్సారెస్పీ. కానీ, ఈ ప్రాజెక్టుకు నీళ్లు రాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం ఎగువన బాబ్లీతోపాటు అనేక ప్రాజెక్టులను నిర్మించింది. ఆనాటి సమైక్య ప్రభుత్వాలు చూసీచూడనట్లుగా వ్యవహరించాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులతో ఎస్సారెస్పీ ఉనికి ప్రశ్నార్థంగా మారుతుందని, తద్వారా ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందన్న ఉద్దేశంతో అప్పుడు బీఆర్ఎస్ అధ్వర్యంలో కేసీఆర్ పెద్ద ఉద్యమమే నడిపారు. వరుస ఆందోళన కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా రాజీవ్హ్రదారిపై వంటావార్పుతోపాటు మహాధర్నాకు పిలుపునిచ్చారు.
చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా రాజీవ్హ్రదారిపై వంటా వార్పు నిర్వహించారు. ఇదొక్కటే కాదు, టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్) ఏర్పడినప్పటి నుంచి మొదలు తెలంగాణకు సమైక్య రాష్ట్రంలో జరిగిన ప్రతి అన్యాయంపైనా పోరు సల్పారు. ఇవే కాదు, నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా ఉద్యమం నడిపి చివరకు తెలంగాణ రాష్ట్రం సాధించారు. సాధించిన రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసే విషయంలో కేసీఆర్ పలు సందర్భాల్లో కేంద్రాన్ని వ్యతిరేకించారే తప్ప, ఏనాడూ తెలంగాణ హక్కులను కేంద్రం వశం చేయలేదు.
ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాలపై ఉన్న హక్కులను కేంద్రానికి ధారాదత్తం చేసిన వైఖరిని నిరసిస్తూ.. మరోసారి కేసీఆర్ ఉద్యమ బాట పడుతున్నారు. ప్రసుత్తం కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో అనుసరించిన తీరుతో దక్షిణ తెలంగాణలోని మెజార్టీ జిల్లాలపై.. ప్రధానంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంపై ప్రభావం పడుతుంది. ఈ విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరును బీఆర్ఎస్ ఎండగడుతూనే ఉన్నది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఒంటెత్తు పోకడను ప్రదర్శిస్తున్నది.
జరిగిన తప్పును ఒప్పుకోకుండా.. ఆ బద్నాంను బీఆర్ఎస్పై వేసేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నది. ఈ నేపథ్యంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కి కాంగ్రెస్ ప్రభుత్వం ధారాదత్తం చేసిన హక్కుల ద్వారా కృష్ణా పరీవాహక ప్రాంత రైతులకు జరిగే అన్యాయాన్ని వివరించి.. వారిని చైతన్యవంతులను చేసే లక్ష్యంతో అధినేత కేసీఆర్ నేడు నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ సభను ప్రారంభించనున్నారు.
నాడు తెలంగాణ హక్కుల సాధనకు ఉద్యమించి.. స్వరాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ, నేడు మరోసారి ప్రజల పక్షాన పోరుబాట పడుతున్నది. కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ హక్కులను కేంద్రానికి ధారాదత్తం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ‘చలో నల్లగొండ’ పేరిట మంగళవారం నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. కృష్ణా పరీవాహక ప్రాంత రైతులకు జరిగే అన్యాయాన్ని వివరించి.. రాష్ట్ర హకులను కాపాడుకునే లక్ష్యంతో ఈ సభ నిర్వహిస్తుండగా, ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో ఇన్చార్జీలు సన్నాహక సమావేశాలు నిర్వహించి, అంతా సిద్ధం చేశారు.
నల్లగొండ సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యర్తలు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కేసీఆర్ చేస్తున్న పోరుబాటకు సంఘీభావం ప్రకటించేందుకు పెద్ద సంఖ్యలో వెళ్లాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరుగుతున్న భారీ బహిరంగ సభ కావడం.. ఇదే సమయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతుండడంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది.
ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి వందలాదిగా తరలి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించారు. ‘చలో నల్గొండ’ పేరిట బహిరంగ సభకు తరలివెళ్లాలని నిర్ణయించారు. అందుకోసం కావాల్సిన ఏర్పాట్లను సైతం చేశారు.