కరీంనగర్ కార్పొరేషన్, అక్టోబర్ 28 : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఆయన హోదాకు ఉన్న గౌరవం తీసేస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు. కేంద్ర హోం శాఖలోనే ఐబీ, ఇంటెలిజెన్స్ ఉంటుందని, వారి నుంచి ఎలాంటి నివేదికలు తీసుకోకుండా, ఆధారాలు లేకుండా విమర్శలు చేయడం సరికాదని సూచించారు. రేవ్ పార్టీ అంటూ ఇష్టం వచ్చినట్టుగా అదుపు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం కేటీఆర్, కేసీఆర్‌ను నిందించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
కక్ష సాధింపుతో డైవర్షన్ రాజకీయాల కోసం కేటీఆర్‌ను నేరుగా ఎదుర్కోలేక కాంగ్రెస్ ప్రభుత్వం వారి బావమరిదిపై తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అమ్మవారి భక్తుడని చెప్పుకొనే బండి సంజయ్ మహిళలను కించపర్చేలా ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఆయనకు సనాతన ధర్మం ఇదే నేర్పిందా? అని ప్రశ్నించారు. కేటీఆర్‌కు టెస్టులు కాదు.. బండి సంజయ్‌కి చేయాలని డిమాండ్ చేశారు. ఆయన తప్పుడు సంస్కారం ఏంటో టెస్టులు చేస్తే బయట పడుతుందన్నారు. దేశంలో డ్రగ్స్ వాడకంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని, అక్కడ ప్రతి ఏటా 32 వేలకు పైగా కేసులు అవుతున్నాయని, అలాగే మహారాష్ట్రలో 29 వేలు, పంజాబ్‌లో 20 వేలకు పైగా కేసులు అవుతున్నాయన్నారు.
కేంద్ర మంత్రి హోదాలో హోంశాఖ నుంచి వీటిని కట్టడి చేయడానికి బండి సంజయ్ ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. పంజాబ్‌లో బీజేపీ ఎమ్మెల్యేనే పట్టుబడ్డారని, అలాగే హైదరాబాద్‌లో గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శి పట్టుబడ్డారని గుర్తు చేశారు. దీనిపై ఆయన మాట్లాడాలన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు ఆగిపోతే మాట్లాడని ఆయన, కేసీఆర్ కుటుంబంపై మాత్రం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కానిస్టేబుళ్లు ధర్నా చేస్తుంటే ఏం చేశారని ప్రశ్నించారు. హైడ్రా, మూసీ ఫ్రంట్ సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి, బీజేపీ కుమ్ముక్కై బీఆర్ఎస్పై, కేసీఆర్ కుటుంబంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఏదో రోజు రేవంత్‌రెడ్డి బీజేపీ సీఎంగా మారుతారని జోస్యం చెప్పారు.
సనాతన ధర్మం కాపాడేవాడినని చెప్పుకొనే సంజయ్ హైదరాబాద్‌లో అమ్మవారి విగ్రహాలను తొలగిస్తుంటే ఎందుకు స్పందించలేదని నిలదీశారు. మంత్రిగా కూడా ఏమీ చేయలేని సంజయ్ వల్ల కరీంనగర్ ప్రజలు సిగ్గుపడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకోవాలని, లేకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మహిళలను కించపర్చేలా మాట్లాడిన బండి సంజయ్ మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్, నాయకులు ఆరె రవిగౌడ్, సత్తినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.