ఊరూరా గులాబీ పండుగ అంబరాన్నంటింది. ఊరూ వాడా బీఆర్ఎస్ జెండా ఎగిరింది. పార్టీ 26 ఏండ్ల ఆవిర్భావ దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మధ్యాహ్నం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. అంతకు ముందు ఉదయం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ గ్రామ, మండల, జిల్లా కార్యాలయాలు, కూడళ్లలో పార్టీ నాయకులు గులాబీ జెండాలు ఎగురవేసి ‘జైకేసీఆర్’ ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు.
అనంతరం ఆయాచోట్ల ముఖ్య నాయకులు మాట్లాడుతూ, ఆనాడు కేసీఆర్ తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)ను స్థాపించి, నాలుగు కోట్ల సమాజాన్ని ఏకం చేసి, స్వరాష్ర్టాన్ని సాధించారని గుర్తు చేశారు. పదేళ్లలో పాలనలో తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారని కొనియాడారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం అవసరమని, అది కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని ఊరూరా ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 26వ ఆవిర్భావ వేడుకలు సోమవారం అంబరాన్నంటాయి. శ్రేణులు ఊరూరా సంబురాలు నిర్వహించాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీ గ్రామ, మండల, జిల్లా కార్యాలయాలు, ప్రధాన కూడళ్లలో నాయకులు గులాబీ జెండాలను ఎగుర వేసి, ‘జై తెలంగాణ, జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. కరీంనగర్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ గులాబీ జెండాను ఆవిషరించారు. జగిత్యాలలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేశ్ స్థానిక నాయకులతో కలిసి గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ఇళ్ల వద్ద పార్టీ నాయకులు జెండాలను ఎగరవేసి సంబురాలు జరుపుకున్నారు.
అలాగే పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గులాబీ జెండాను ఆవిష్కరించారు. పెద్దపల్లి ప్రభుత్వ ప్రధాన దవాఖాన ముందు గులాబీ జెండాలను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి గులాబీ జెండా ఆవిష్కరించారు. గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామమూర్తి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, గులాబీ జెండాను ఎగురవేశారు. ఇక సిరిసిల్ల జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జిల్లాకేంద్రంలోని తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గులాబీ జెండాను ఎగురవేశారు. స్థానిక పాతబస్టాండ్‌లో అమరవీరుల స్తూపం వద్ద పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి జెండా ఆవిష్కరించారు. కొత్త బస్టాండ్‌లో తెలంగాణ తల్లి, నేతన్న విగ్రహాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణచౌక్‌లో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం గులాబీ జెండాను ఆవిషరించి, స్వీట్లు పంచి సంబురాలు జరిపారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల ముఖ్య నాయకులు మాట్లాడారు. పాతికేళ్ల కింద తెలంగాణ సాధనే లక్ష్యంగా కేసీఆర్ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)ను పెట్టారని గుర్తు చేశారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి, పధ్నాలుగేళ్లు అలుపెరగని పోరాటం చేసి స్వరాష్ర్టాన్ని సాధించారని చెప్పారు. అనంతరం పదేళ్ల పాలనలో రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారిని కొనియాడారు. కానీ, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ తిరోగమనం దిశగా పయనిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు తెలంగాణ పునర్మిర్మాణం అవసరమని, అది కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాబోయేది కచ్చితంగా బీఆర్ఎస్సేనని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాతికేళ్ల ప్రస్థానంలో చెరగని ముద్ర వేసుకున్నదని చెప్పారు.

పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి. అభివృద్ధిలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్లింది. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చడమే ధ్యేయంగా కేసీఆర్ తన పదవులను వదులుకుని టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)ను స్థాపించారు. పార్టీ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగానే స్వరాష్ట్రం సిద్ధించింది. కేసీఆర్ పదేళ్ల పాలనలో బంగారు తెలంగాణే లక్ష్యంగా రాష్ర్టాన్ని అభివృద్ధి చేశారు. తెలంగాణ ప్రాంతాన్ని దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మార్చారు. రెండున్నరేళ్ల రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టింది. ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం అవసరం. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే అది సాధ్యమవుతుంది. అందుకోసం బీఆర్ఎస్ శ్రేణులంతా కలిసి కట్టుగా పని చేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎండగట్టాలి.
– కోరుకంటి చందర్, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేపట్టిన మలిదశ ఉద్యమానికి బీఆర్ఎస్ ఊపిరిపోసింది. ఉమ్మడి రాష్ట్రంలో దోపిడికీ గురవుతున్న తెలంగాణకు విముక్తి కల్పించేందుకు కేసీఆర్ పాతికేళ్ల క్రితం టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ను స్థాపించి సకలజనులను ఏకం చేశారు. ఇది రాష్ట్ర ఉద్యమ చరిత్రలో లిఖించదగిన రోజు. కేసీఆర్ అహింసా మార్గంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో పదేళ్ల పాటు సుపరిపాలన అందించి, రాష్ర్టాన్ని దేశంలో అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారు. మూడేన్నరేళ్లలోనే అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతున్నది. ప్రజా పాలన పేరుతో ఏర్పడ్డ కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నది. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరో ఉద్యమం తప్పదు.
– దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడానికి ఆనాడు కేసీఆర్ టీఆర్ఎస్ (ప్రస్తుతం బీఆర్ఎస్)ను స్థాపించారు. ప్రజలను చైతన్యం చేసి, ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేపట్టి స్వరాష్ర్టాన్ని సాధించారు. అంతే కాకుండా, పదేళ్లలో పాలనలో రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్‌దే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. రెండున్నరేళ్లలోనే ప్రజలు విసుగుచెందారు. మళ్లీ ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని కోరుకుంటున్నారు.
– దావ వసంతసురేశ్, జగిత్యాల జడ్పీ మాజీ చైర్ పర్సన్

తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఏర్పడిందే టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన తెలంగాణ కోసం కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించారు. సాధించుకున్న రాష్ర్టాన్ని పదేండ్ల పాలనలో అభివృద్ధిలో దేశానికే మార్గదర్శకంగా నిలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిని సాధించింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పోరాడుతుంది. కేసీఆర్, కేటీఆర్‌ను నష్టపరిచేందుకు ఎవరెన్ని కుయుక్తులు పన్నినా వారి ఎత్తుగడలు చెల్లబోవు. మహానేత కేసీఆర్ స్థానం ప్రజల గుండెల్లో ఉంటుంది.
– తోట ఆగయ్య, బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు