Huzurabad | హుజరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, హుజురాబాద్ మున్సిపల్‌పై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మున్సిపల్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు మంద ఉమాదేవి-రమేష్ (ఆర్కే) అన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని 21 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గోవర్ధన్ ను గెలిపించాలని కోరుతూ ఆయన ఆదివారం విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలోనే హుజురాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా హుజురాబాద్ కు చేసిందేమీ లేదని మండిపడ్డారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల్లో ఏ ఒక్క పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని, హుజురాబాద్ మున్సిపల్ పై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ పట్టణ ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.