Fatty Liver | కాలేయం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో ఒకటి. జీర్ణవ్యవస్థ నుంచి వచ్చే రక్తాన్ని శుద్ధి చేయడం, శరీరంలోని విషపదార్థాలను తొలగించడం, మందులను జీర్ణక్రియకు అనుకూలంగా మార్చడం, పిత్తరసాన్ని ఉత్పత్తి చేయడం వంటి అనేక కీలక విధులను నిర్వహిస్తుంది. ప్రోటీన్ల తయారీ, రక్తం గడ్డకట్టడం, కొలెస్ట్రాల్ నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడం, ఇన్ఫెక్షన్లతో పోరాడటం వంటి పనుల్లోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కాలేయంలో కొవ్వు అధికంగా పేరుకుపోతే ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్‌లో ప్రధానంగా రెండు రకాలున్నాయి. ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కాగా, మరొకటి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. కాలేయం తన సాధారణ విధులను సక్రమంగా నిర్వహించలేని స్థాయిలో కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. సాధారణంగా మనం తీసుకునే కార్బొహైడ్రేట్లు, కొవ్వులు శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు వాటిలో కొంత భాగం కొవ్వుగా నిల్వ అవుతుంది. కొంతకాలానికి ఈ అదనపు కొవ్వు కాలేయంలోనూ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పేరుకుపోతుంది. కాలేయ బరువులో 5 నుంచి 10 శాతానికి పైగా కొవ్వు ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్గా పరిగణిస్తారు.
ఫ్యాటీ లివర్‌ను ప్రారంభ దశలో గుర్తిస్తే జీవనశైలిలో మార్పులు చేయడం ద్వారా పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఈ సమస్యకు ప్రత్యేకమైన లక్షణాలు తప్పనిసరిగా కనిపించవు. కొందరిలో అలసట, పొత్తికడుపులో అసౌకర్యం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. పరీక్షల్లో కాలేయం పరిమాణం పెరిగినట్లు కూడా గుర్తిస్తారు. కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు వాపులకు దారితీస్తే అలసట, గందరగోళం, పొత్తికడుపు నొప్పి, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, శారీరక బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన పరిస్థితుల్లో పొత్తికడుపు ఉబ్బడం, కామెర్లు రావడం, సులభంగా రక్తస్రావం కావడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఊబకాయం, మధుమేహం ఫ్యాటీ లివర్‌కు ముఖ్యమైన కారణాల్లో భాగంగా ఉన్నాయిజ. వీటితో పాటు కొవ్వు, చక్కెర అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, అధికంగా మద్యం సేవించడం, జన్యుపరమైన కారణాలు, వేగంగా బరువు తగ్గడం, కొన్ని మందుల దుష్ప్రభావాలు, రక్తంలో కొవ్వు స్థాయిలు అధికంగా ఉండటం వంటి కారణాలు కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీస్తాయి.
ఫ్యాటీ లివర్‌ను నియంత్రించడంలో ఆహారపు అలవాట్లకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర అధికంగా ఉండే ఆహారాన్ని తగ్గించడం ఉపయోగకరంగా ఉంటుంది. మైదా, తెల్ల చక్కెర వినియోగాన్ని తగ్గించడంతోపాటు మద్యం తీసుకోవడం పూర్తిగా మానేయడం లేదా గణనీయంగా తగ్గించడం కూడా ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతోపాటు అదనపు కొవ్వును తగ్గించుకోవడంలో సహాయపడతాయి. తీసుకునే కేలరీలను నియంత్రించడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తి, తీసుకునే ఆహారం మధ్య సమతుల్యతను పాటించవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, ఆలివ్ ఆయిల్, చేపలు ఎక్కువగా ఉండే మెడిటరేనియన్ ఆహార విధానం కూడా ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ కొవ్వుతో కూడిన ఆహారం, శారీరక వ్యాయామంతో కలిపి తీసుకోవడం కూడా ఫ్యాటీ లివర్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.
వెల్లుల్లి ఫ్యాటీ లివర్ ఉన్నవారి ఆహారంలో చేర్చుకోదగిన పదార్థాల్లో ఒకటిగా చెప్పవచ్చు. వెల్లుల్లిని తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో శరీర బరువు, కొవ్వు తగ్గే అవకాశం ఉందని ఒక అధ్యయనం సూచించింది. కాఫీలో ఉండే కొన్ని సమ్మేళనాలు నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అందువల్ల ఫ్యాటీ లివర్ ఉన్నవారి ఆహార ప్రణాళికలో కాఫీని కూడా చేర్చుకోవచ్చు. బ్రోకలీ కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా సహాయపడే కూరగాయగా ఉంది. దీర్ఘకాలం పాటు బ్రోకలీని తీసుకోవడం వల్ల ఎలుకల్లో కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం తగ్గినట్లు ఒక అధ్యయనంలో గుర్తించారు. బ్రోకలీతోపాటు పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలు కూడా కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గ్రీన్ టీ కూడా ఫ్యాటీ లివర్ ఆహారంలో చేర్చుకోదగిన పానీయం. ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల శరీరంలోని కొవ్వు శాతం, రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
సోయా లేదా వెయ్ ప్రోటీన్ కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా సహాయపడతాయి. ముఖ్యంగా టోఫులో కొవ్వు తక్కువగా, ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఫ్యాటీ లివర్ ఉన్నవారికి అనుకూలమైన ఆహారం. వాల్‌నట్స్‌లో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారు వాల్నట్స్ తీసుకోవడం వల్ల కాలేయ పనితీరుకు సంబంధించిన పరీక్షల్లో మెరుగుదల కనిపిస్తుంది. సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తూ కాలేయాన్ని మరింత నష్టం నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. అందువల్ల వీటిని కూడా ఆహారంలో పరిమితంగా చేర్చుకోవచ్చు. ఆలివ్ ఆయిల్లో ఉండే ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు కాలేయ ఎంజైమ్‌ల స్థాయిలను తగ్గించడంలో, బరువును నియంత్రించడంలో సహాయపడతాయి. అందువల్ల ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఆరోగ్యకరమైన కొవ్వుల వనరుగా ఆలివ్ ఆయిల్‌ను పరిమితంగా ఉపయోగించవచ్చు. అదే సమయంలో ఫ్యాటీ లివర్ ఉన్నవారు మద్యం, అదనపు చక్కెర, రెడ్ మీట్, అధిక ఉప్పు, వేయించిన పదార్థాలు, వైట్ బ్రెడ్, తెల్ల బియ్యం, పాస్తా వంటి ఆహారాలను తగ్గించడం లేదా నివారించడం మంచిది. అయితే ఫ్యాటీ లివర్ పరిస్థితి ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి సరైన చికిత్స, ఆహార ప్రణాళిక కోసం వైద్య నిపుణుల సలహా తీసుకోవడం అవసరం.