కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ కన్నెర్రజేసింది. యూరియా కోసం గోస పడుతున్న రైతన్నకు మద్దతుగా.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరుబాట పట్టింది. సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ శనివారం చిగురుమామిడి మండల కేంద్రంతో పాటు గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో నిరసనలకు దిగింది.
చిగురుమామిడి/గంగాధర, ఆగస్టు 23: యూరియా కోసం రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. శనివారం చిగురుమామిడి మండలకేంద్రంలో రైతులతో కలిసి బస్టాండ్ ఎదుట ధర్నా, రాస్తారోకో చేసింది. గంటపాటు బైఠాయించడంతో కరీంనగర్-హుస్నాబాద్ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోగా వందలాది మంది ప్రయాణికులు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో యూరియా అందించడంలో వైఫల్యం చెందడంతోనే ఈ పరిస్థితులు దాపురించాయని మండిపడ్డారు. ఎస్ఐ సాయికృష్ణ అక్కడికి చేరుకొని రాస్తారోకో విరమింపజేసేందుకు ప్రయత్నించగా, నాయకులు ససేమిరా అన్నారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు బలవంతంగా నాయకులను వాహనాల్లో ఎక్కించి ఠాణాకు తరలించడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మధురానగర్లో ఉద్రిక్తత
యూరియా కొరత తీర్చాలని గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా, రాస్తారోకో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. ధర్నాకు చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు తరలిరాగా, అప్పటికే మధురానగర్ చౌరస్తాలో గంగాధర ఎస్ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో బలగాలను మోహరించారు.
ధర్నాకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించగా, నాయకులు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్రావు గాలి బొటన వేలు చిట్లి గాయమైంది. మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసి తీసుకెళ్తుండగా మిగిలిన నాయకులు ధర్నా చేయడానికి రోడ్డుపై బైఠాయించగా పోలీసులు వారిని బలవంతంగా ఈడ్చుకెల్లి వాహనాల్లో ఎక్కించారు. గంగాధర పోలీస్ స్టేషన్కు తరలించి మధ్యాహ్నం విడుదల చేశారు.
తీరని యూరియా కష్టాలు
సైదాపూర్, ఆగస్టు 23: రైతన్నను యూరియా కష్టం వెంటాడుతున్నది. రోజురోజుకూ కొరత తీవ్రమవుతున్నది. రోజుల తరబడి పడిగాపులుపడ్డా ఒక్క బ్యాగు దొరకడమే కష్టమైపోతున్నది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. శనివారం సైదాపూర్ మండలకేంద్రంలోని వెన్కెపల్లి- సైదాపూర్ సింగిల్ విండోకు 440 యూరియా బస్తాలు వచ్చాయి. సమాచారం తెలుసుకున్న సమీప గ్రామాల్లోని 700 మంది రైతులు తరలివచ్చారు.
క్యూ కట్టారు. మండల వ్యవసాయ అధికారి వైదేహితో పాటు పోలీసులు, సహకార సిబ్బంది రైతులకు టోకెన్లు అందించారు. ఒక్కో రైతుకు ఒక బస్తాచొప్పున అందజేయగా, మిగిలిన రైతులు ఉత్త చేతులతో వెనుదిరిగారు. రోజంతా లైన్లో నిల్చున్నా దొరకలేదని వాపోయారు. వెంటనే స్టాక్ తెప్పించి అందరికీ అందజేయాలని, ఒక్క బస్తాతో ప్రయోజనం ఏముందని, సరిపడా పంపిణీ చేయాలని కోరుతున్నారు.