కరీంనగర్ కార్పొరేషన్, మే 30 : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు స్పష్టం చేశారు. గురువారం కరీంనగర్‌లోని మాజీ ఎం పీ బోయినపల్లి వినోద్‌కుమార్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూన్ ఒకటిన జిల్లా నుంచి వెయ్యి మంది ముఖ్య నాయకులతో హైదరాబాద్‌కు వెళ్తామని, సాయంత్రం 5.30 గంటలకు గన్‌పార్క్ నుంచి సెక్రటేరియ ట్ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం వరకు ర్యాలీలో పాల్గొంటామని తెలిపారు. జూన్ 2న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగే వేడుకల్లో పాల్గొంటామన్నారు.
3న కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్లో జాతీయ జెండాతోపాటు బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని చెప్పారు. వీటితోపాటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామన్నారు. పద్నాలుగేళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో పదేళ్ల పాటు రాష్ర్టాన్ని కేసీఆర్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. అన్ని ప్రాంతాల్లో వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎం పీ, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, జ డ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్, సిరిసిల్ల జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, గ్రంథాలయ మాజీ చైర్మన్లు పొన్నం అనిల్, ఏనుగు రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్రనాయకులు వీర్ల వెంకటేశ్వర్రావు, బండ శ్రీనివాస్ పాల్గొన్నారు.