ఉద్యమం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే బీఆర్ఎస్ అధినేత మరోసారి కదనభేరిని మోగించబోతున్నారు. నేడు ఎస్సారార్ కళాశాల మైదానం నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. మంగళవారం సాయంత్రం లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనుండగా, ఆ మేరకు బీఆర్ఎస్ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అంతా సిద్ధం చేయడంతోపాటు నగరాన్ని గులాబీమయం చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనుండగా, అందరీ దృష్టి ఈ సభపైనే ఉన్నది.
బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నుంచి మొదలు కొని సకల జనుల సమ్మె వరకు కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానం వేదికగా నిలిచింది. ఎన్నో ముఖ్య ఘట్టాలకు కేంద్రమైంది. 2001 మే 17న పార్టీ ఆవిర్భావం సందర్భంగా ‘సింహగర్జన’ పేరిట నిర్వహించిన సభ ఒక చరిత్ర సృష్టించింది. యావత్ తెలంగాణ ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చింది.
ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా 2011 సెప్టెంబర్ 23న ఇక్కడ జరిగిన బహిరంగ సభా వేదిక నుంచే సకలజనుల చారిత్రక సమ్మెకు పిలుపునివ్వగా, అది చరిత్రలో నిలిచిపోయింది. 2014 ఏప్రిల్ 13న జరిగిన బహిరంగ సభ నుంచే సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరించగా, పార్టీ అద్భుత విజయాన్ని అందుకున్నది. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్, మరోసారి కలిసొచ్చిన ఎస్సారార్ కాలేజీ గ్రౌండ్ నుంచే శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది. నేడు కదనభేరి పేరిట తొలి ప్రచార బహిరంగ సభను నిర్వహించబోతున్నది.
కరీంనగర్, మార్చి 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కరీంనగర్ (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్‌ను సెంటిమెంట్‌గా భావిస్తారు. 2001లో ఎక్కడైతే తెలంగాణ ఉద్యమ బావుటాను ఎగురవేశారో ఇప్పుడు అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తున్నారు. కలిసొచ్చిన ఎస్సారార్ కళాశాల మైదానం వేదికగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు కదనభేరి సభ నిర్వహిస్తున్నారు. అధినేత కేసీఆర్ సహా పార్టీ అగ్రనాయకత్వం హాజరవుతుండగా, కళాశాల మైదానంలో సభా వేదికతోపాటు సభికుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటు కరీంనగర్‌ను గులాబీ మయం చేశారు. చౌరస్తాలను ముస్తాబు చేశారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి లక్ష మందిని సమీకరించి సభను విజయవంతం చేయాలనే కృతనిశ్చయంతో బీఆర్ఎస్ నాయకులు కనిపిస్తున్నారు. పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్లో ప్రత్యేకంగా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సభా ఏర్పాట్లను ప్రతి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. భారీ జన సమీకరణలో భాగంగా అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సమాయత్త సమావేశాలు నిర్వహించి కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపారు.
అధినేత కేసీఆర్ తనకు కలిసి వచ్చే కరీంనగర్ నుంచే పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఈ సభకు రాజకీయ ప్రాధాన్యత చేకూరింది. తమ పార్టీ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్‌కుమార్ కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే అధిష్టానం ప్రకటించింది. పార్లమెంట్ సభ్యుడిగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా అపార రాజకీయ అనుభవమున్న వినోద్‌కుమార్ అంటే పార్టీ శ్రేణుల్లో ప్రత్యేకమైన అభిమానం ఉంది. కరీంనగర్ పార్లమెంట్‌కు, రాష్ర్టానికి గతంలో వినోద్ చేసిన సేవలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ రాజకీయాలకు తప్ప అభివృద్ధి విషయంలో ఏ మాత్రం శ్రద్ధ చూపలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు.
అంతే కాకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌పై మూడు నెలల్లోనే వ్యతిరేకత కనిపిస్తుండగా, నాటి, నేటి పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి కష్టాలూ రాకుండా చూసుకున్న తీరును, నేడు సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా పట్టని కాంగ్రెస్ ధోరణిని గమనిస్తున్నారు. కేసీఆర్ సర్కారు ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే భావనకు వచ్చారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మల్చుకుని అత్యధిక స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో కరీంనగర్లో కదనభేరి సభకు అత్యంత రాజకీయ ప్రాధాన్యత కనిపిస్తున్నది. పార్టీ అధినేత చేసే ప్రసంగాన్ని వినేందుకు యావత్ రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ అధిష్టానం కరీంనగర్ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నది. అందులో భాగంగా నేడు కదనభేరిని మోగించబోతున్నది. కరీంనగర్, చొప్పదండి, సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్, మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని సమీకరిస్తున్నారు. లక్ష మందికి తక్కువ కాకుండా తరలించేందుకు అన్ని స్థాయిల్లో నాయకులు సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకుని జనాన్ని మోటివేట్ చేస్తున్నారు. సభా స్థలిలో ఏ ఒక్కలోటూ కనిపించకుండా పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పార్టీ నాయకులు బాధ్యతలు పంచుకుని పనిచేస్తున్నారు.
సభా స్థలే కాకుండా నగరంలోని చౌరస్తాలన్నింటినీ గులాబీ మయంగా చేయగా, కరీంనగర్‌కు చేరుకునే ప్రధాన రహదారులను భారీ కటౌట్లతో నింపేశారు. సభకు తరలి వచ్చే జనాలు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం ఎస్సారార్ కళాశాల మైదానంలో సభా స్థలాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఎకడా ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మంచినీటి సదుపాయంతో పాటు పారింగ్ కోసం ప్రత్యేక స్థలాలను గుర్తించినట్లు చెప్పారు. వారి వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, నగర మేయర్ సునీల్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, టీఆర్ఎస్ నాయకులు పొన్నం అనిల్, లోక బాపురెడ్డి పాల్గొన్నారు.