Minister Adluri | ధర్మారం, డిసెంబర్ 6 : రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురి అసెంబ్లీ వర్గంలోని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నాయకంపల్లి గ్రామంలో ఎస్టీ జనరల్ సర్పంచ్ గా శైనేని రవి (బీఆర్ఎస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే గ్రామంలోని మొత్తం 6 స్థానాలలో వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఇక్కడ సంచలనం సృష్టించింది. మండల వ్యాప్తంగా రెండో విడతలో గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
మండలంలో 29 స్థానాలు ఉండగా ఇందులో మూడు గ్రామాలలో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా శనివారం ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల ఉపసంహరణ ప్రక్రియను చేపట్టారు. దీంతో నాయకంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శైనేని రవితోపాటు మరో ముగ్గురు అభ్యర్థులు సర్పంచ్ పదవి కోసం నామినేషన్లు వేయగా పోటీ నుంచి ప్రత్యర్థిగా ఉన్న ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు పోటీ నుంచి ఉపసంహరించుకున్నారు.
దీంతో ఆ గ్రామ సర్పంచ్ గా శైనేని రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలోని మొత్తం ఆరుగురు వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. మండలం మొత్తం మీద ఈ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. కాగా ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికైన రవిని నంది మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కాంపల్లి చంద్రశేఖర్, ఆవుల శ్రీనివాస్, గూడూరి లక్ష్మణ్, బండారి శ్రీనివాస్, ఆవుల వేణు, మెన్నేని రాంబాబు తదితరులు శాలువాతో సత్కరించి అభినందించారు. కాగా మండలంలో బొట్లవనపర్తి లో సంగ రంజిత్ కుమార్, బంజేరుపల్లిలో కళ్లెం ఇందిర సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.