Dasari Manohar Reddy | ఓదెల, డిసెంబర్ 15: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ సోమవారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కనగర్తి లో ఇట్యాల పద్మ, ఓదెలలో డాక్టర్ కనకిరెడ్డి సతీష్, మడకలో గోశిక కమల్ గెలిపించాలని దాసరి మనోహర్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేక హామీలను విస్మరించి మోసగించినట్లు పేర్కొన్నారు. గ్రామాలలో గత పది సంవత్సరాలు టిఆర్ఎస్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందే తప్ప రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోలేదన్నారు.
మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని, అలాగే వృద్ధులు వికలాంగుల పింఛన్లు పెంచుతామని చెప్పి మోసగించిందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐ రెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గంట రాములు యాదవ్, మాజీ సర్పంచులు ఆరెల్లి మొండయ్య గౌడ్, మధుసూదన్ రావు, దామోదర్ రెడ్డి, నాయకులు నోముల ఇంద్రారెడ్డి, మేడగొని శ్రీకాంత్ గౌడ్, గొర్ల కుమార్, పోలోజు రమేష్ తదితరులు పాల్గొన్నారు.