మల్లాపూర్, జూలై 10 : బీఆర్ఎస్ మల్లాపూర్ మండల స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి గులాబీ దళం నీరాజనం పట్టింది. మల్లాపూర్‌లో పార్టీ మండల కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి 23 గ్రామాల నుంచి తరలివచ్చి, పార్టీ ముఖ్య నాయకులకు జైకొట్టింది. ‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించింది. సమ్మేళనం గ్రాండ్ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొన్నది. కార్లు, బైక్‌లతో భారీ ర్యాలీ మల్లాపూర్ మండల కేంద్రంలో నూతనంగా బీఆర్ఎస్ మండల కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కాగా, బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హాజరై కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల, మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మండల స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా, దిగ్విజయంగా సాగింది. కాగా, అంతకు ముందు పార్టీ శ్రేణులు ముత్యంపేటలో అతిథులకు గజమాలతో ఘనస్వాగతం పలికారు.
అనంతరం వందలాది కార్లు, బైక్‌లతో మండల కేంద్రానికి ర్యాలీగా వచ్చారు. మల్లాపూర్, రాఘవపేట, ముత్యంపేట గ్రామాల్లో అంబేద్కర్, జ్యోతిబా ఫూలే, అల్లూరి సీతారామరాజు, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కాటిపల్లి సరోజ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కదుర్క నర్సయ్య, వైస్ చైర్మన్ ముద్దం శరత్‌గౌడ్, మాజీ వైస్‌ఎంపీపీ గౌరు నాగేష్, సింగిల్‌విండో చైర్మన్లు వేంపేట నర్సారెడ్డి, బద్ధం అంజిరెడ్డి, నేరేళ్ల మోహన్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీల ఫోరం మాజీ మండలాధ్యక్షుడు రాంరెడ్డి, ఆర్బీఎస్ మాజీ జిల్లా డైరెక్టర్ దేవ మల్లయ్య, మండలాధ్యక్షుడు జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్వై మండలాధ్యక్షుడు సతీశ్, మహిళా విభాగం మండలాధ్యక్షురాలు సరిత, పట్టణాధ్యక్షుడు లింగస్వామి, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా ఎన్నికల ముందు ప్రజలకు అనేక మాయమాటలు చెప్పింది. ఆరు గ్యారంటీలు అని నమ్మించి 420 హామీలిచ్చి మోసం చేసింది. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి పాలన విఫలమైంది. ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ఏనాడో గాలికివదిలేసింది. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీ నాయకులను హామీల గురించి నిలదీయాలి. ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించాలి. తగిన గుణపాఠం చెప్పాలి.
కోరుట్ల నియోజకవర్గంలో ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నరు. ఇప్పటికే వరుసగా నాలుగుసార్లు విద్యాసాగర్‌రావును, తర్వాత ఆయన తనయుడు కల్వకుంట్ల సంజయ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజల కష్టాసుఖాలన్నీ వీరికి తెలుసు. మల్లాపూర్ మండల ఆత్మీయ సమ్మేళనం చూస్తే మళ్లీ బీఆర్ఎస్సే అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తున్నది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామాల్లోని బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం కావాలి.
గత శాసనసభ ఎన్నికల్లో కోరుట్లలో మూడోస్థానంలో నిలిచిన నాయకులు ఇక్కడ పార్టీ పేరు చెప్పుకొని అధికారం చెలాయిస్తున్నరు. ఇక్కడి ప్రజలకు ఉట్టోళ్లు ఎవరో..? గట్టోళ్లు ఎవరో..? స్పష్టంగా తెలుసు. అందుకే ఐదు పర్యాయాలుగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్కు పట్టంగడుతూ వస్తున్నరు. వచ్చే ఎన్నికలు ఏవైనా సరే ఎగిరేది గులాబీ జెండానే. గ్రామాల్లో కార్యకర్తలు సమన్వయంతో పని చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి.