కొత్తపల్లి, డిసెంబరు 19 : క్రీడలతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని, క్రీడా రంగంలో రాణించిన వారికి పలు శాఖల్లో ఉద్యోగాలతో పాటు ఉద్యోగ నియామకాల్లో రెండు శాతం క్రీడా కోటా రిజర్వేషన్ వర్తిస్తుందని మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి తెలిపారు. సోమవారం పద్మనగర్‌లోని మానేరు సెంట్రల్ సూల్లో యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు నిర్వహించిన జూడో, రెజ్లింగ్ జట్ల ఎంపిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఆల్ ఇండియా, దక్షిణ భారత స్థాయి యూనివర్సిటీల క్రీడల్లో భాగంగా శాతవాహన యూనివర్సిటీ క్రీడాకారులు అద్వితీయ ప్రతిభను కనబరిచి చాంపియన్‌షిప్‌ను సాధించి శాతవాహన యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. ఆత్మసె్థైర్యానికి, ఆత్మవిశ్వానికి జూడో, రెజ్లింగ్ క్రీడలు దోహదపడుతాయని చెప్పారు. క్రీడల్లో రాణించిన వారు అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు.
మానేరులో విద్యతో పాటు క్రీడలకు సముచిత స్థానాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. జూడో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, జిల్లా జూడో సంఘం ఉపాధ్యాక్షుడు తుమ్మల రమేశ్ రెడ్డి మాట్లాడుతూ ఉడుం పట్టు లాంటి జూడో, రెజ్లింగ్ క్రీడల్లో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాకు అరుదైన ఘనత ఉందన్నారు.
శాతవాహన జట్లు కూడా ఆల్ ఇండియా పోటీల్లో రాణించి పతకాలు కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ పోటీలకు వర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 100 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. వర్సిటీ స్థాయి పోటీల్లో రాణించిన క్రీడాకారులను త్వరలో పంజాబ్‌లో జరిగే ఆల్ ఇండియా పోటీలకు ఎంపిక చేసినట్లు ఫిజికల్ డైరెక్టర్లు నాగేశ్వర్ రావు, శ్రీధర్‌రావు పేర్కొన్నారు. అనంతరం వారు జూడో, రెజ్లింగ్ మ్యాచ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో జూడో, రెజ్లింగ్ సంఘాల బాధ్యలు ఎల్వీ రమణ, సిలివేరి మహేందర్, పూర్ణసాయి అఖిల్, వంశీ, శ్రీధర్, నేదునూరి శ్రీనివాస్, జూడో కోచ్ సాయిరాం యాదవ్, పీడీలు సర్వర్, ఎల్లయ్య, ముజాఫర్, సంతోష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.