కరీంనగర్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల బదిలీలకు బ్రేక్ పడింది. ట్రాన్స్ఫర్లలో రోజుకో నిబంధన రావడంతో ఆందోళనకు గురైన అన్ని విభాగాల్లోని అధికారులు, మంగళవారం ఎన్నికల సంఘం నుంచి ఇచ్చిన క్లారిటీతో ఊపిరి పీల్చుకున్నారు. తాజా ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలోని వివిధ విభాగాలకు చెందిన 350కిపైగా బదిలీలకు బ్రేక్ పడింది. వివరాల ప్రకారం.. రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీగా బదిలీలు జరుగుతున్న విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే ఈ సారి ఉమ్మడి జిల్లాలో సుమారు వెయ్యి బదిలీలు ఇప్పటికే జరిగాయి. అధికారులు సొంత జిల్లాలో పనిచేయరాదని, అలాగే సర్వీసులో ఏప్రిల్ నాటికి మూడేళ్లు నిండిన వారిని విధిగా బదిలీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటికే ట్రాన్స్ఫర్ల ప్రక్రియను పూర్తి చేశారు. దాంతో సంబంధిత అధికారులు తమకు కేటాయించిన పోస్టుల్లో జాయిన్ అయ్యారు. బదిలీలు ముగిశాయనుకున్న తరుణంలో ఎన్నికల సంఘం ఈ నెల 23న ట్రాన్స్ఫర్లకు సంబంధించి కొత్త నిబంధనను తెరపైకి తెచ్చి ఆదేశాలు జారీ చేసింది. స్థానికతను ఆధారంగా చేసుకొని ఒక లోక్‌సభకు చెందిన అధికారులు.. అదే లోక్‌సభలో ఉండరాదని, సదరు అధికారులను గుర్తించి బదిలీ చేయాలని ఆదేశించింది.
ఆ రకంగా చూస్తే.. తాజాగా పోస్టింగ్‌లో చేరిన వందలాది మంది మళ్లీ తట్టాబుట్టా సర్దుకునే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సంఘం ఆదేశాలు కావడంతో ఇక ట్రాన్స్ఫర్లు తప్పవనే ఆందోళన కనిపించింది. ఇటు ఈసీ ఆదేశాల మేరకు.. ఉన్నతాధికారులు మళ్లీ బదిలీల జాబితా సిద్ధం చేశారు. పార్లమెంట్ స్థానం ఆధారంగా బదిలీలు చేస్తే క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు తలెత్తుతాయని గుర్తించి ఈ విషయాన్ని రాష్ట్ర ప్రన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లగా, వారు ఎన్నికల సంఘం దృష్టికి లిఖిత పూర్వకంగా తీసుకెళ్లారు. దీంతో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 23న ఇచ్చిన నిబంధనలకు సడలింపు ఇస్తూ.. కేవలం కొంతమంది ఉన్నత స్థాయి అధికారులకు అది కూడా రెవెన్యూ, పోలీస్ విభాగాలకు మాత్రమే పరిమితం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తాజాగా వచ్చిన ఆదేశాల ప్రకారం చూస్తే.. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ (డీఈవో) అలాగే డిప్యూటీ డీఈవో, ఆర్వో, ఏఆర్వో, ఐజీ, డీఐజీ, సీనియర్ ఎస్పీ, ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ వంటి తత్సమాన పోస్టులకు మాత్రమే నిబంధన వర్తిస్తుందని స్పష్టత నిచ్చింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తాజా ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలో సుమారు 359కిపైగా బదిలీలకు బ్రేక్‌పడుతుందని అధికారవర్గాల ద్వారా సమాచారం. అంతేకాదు, ఏదైనా ప్రత్యేక సమస్య, లేదా ఆరోపణలు వస్తే తప్ప.. ఎన్నికల బదిలీలు పెద్ద మొత్తంలో ఉండే అవకాశాలు లేవు. దీంతో ఇటీవలే పోస్టుల్లో చేరిన అధికారులు స్వేచ్ఛగా పనిచేసుకునేందుకు ఆస్కారం ఏర్పడినట్లయింది.