Accident | కోరుట్ల, జూలై 16 : కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని బాలాజీ రోడ్డుకు చెందిన మగ్గిడి రవీందర్-సుమ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరి చిన్న కుమారుడు జస్వంత్ (13) పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం వరుసకు అన్న అయిన చాణక్యతో కలిసి ద్విచక్ర వాహనంపై కోరుట్ల కొత్త బస్టాండ్‌కు పనిమీద వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా రహదారిపై మూలమలిగేందుకు ద్విచక్ర వాహనంపై వేచి ఉన్నారు.
అదే సమయంలో కోరుట్ల నుంచి వేములవాడ వైపు వస్తున్న డీజిల్ ట్యాంకర్ వేగంగా వచ్చి వెనకనుంచి వచ్చి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న జస్వంత్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, చాణక్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు జస్వంత్ ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. అల్లరి ముద్దుగా పెంచుకున్న జస్వంత్ మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.