ఎల్లారెడ్డిపేట, ఫిబ్రవరి 23: వచ్చే నెలలో ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతున్న ఆ వలసజీవి గుండె మధ్యలోనే ఆగిపోయింది. పెద్దదిక్కు రాక కోసం ఆనందంగా ఎదురుచూస్తున్న ఆ కుటుంబం విషాదంలో మునిగింది. వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన నిమ్మల రాజు (45)కు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. ఉపాధి కోసం రాజు పదేండ్లుగా బహ్రెయిన్‌కు వెళ్లొస్తున్నాడు. అక్కడ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడేండ్ల క్రితం ఇంటికి వచ్చి తిరిగి వెళ్లాడు. మూడు, నాలుగు రోజుల క్రితమే ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాడు.
కంపెనీకి లెటర్ రాశానని, మార్చిలో వస్తానని సంతోషంగా చెప్పాడు. కానీ, అంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం మధ్యాహ్నం రూం నుంచి డ్యూటీకి వెళ్లే క్రమంలో ఛాతిలో నొప్పితో తల్లడిల్లిపోయాడు. అదే రూంలో ఉన్న స్నేహితులు రాజును దవాఖానకు తరలించే క్రమంలోనే చనిపోయాడు. ఈ విషయం తెలియడంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. ‘మా కోసం ఎన్నో ఏండ్ల సంది దేశం పోతున్నవ్. వచ్చే నెలలో ఇంటికి వస్తానని మొన్న సంతోషంగా చెప్పినవ్. పిల్లలకు ఏం కావాలో చెప్పు అని రాసుకుంటివి’ అని గుర్తు చేసుకుంటూ ఆ భార్య కన్నీరుమున్నీరైంది. ‘దేవుడా.. ఎందికిట్ల చేసినవయ్యా’ అంటూ గుండెలవిసేలా రోదించింది.