కొత్త జిల్లాలు ఏర్పడినా కరీంనగర్ వన్నే ఏమాత్రం తగ్గలేదు. సకల సౌకర్యాలతో నగరం రోజురోజుకూ విస్తరిస్తూనే ఉన్నది. రాష్ట్రంలోనే రెండో నగరంగా ఎదగడం, అభివృద్ధిలో దూసుకెళ్లడం, నలువైపులా ప్రధాన రహదారులు విస్తరించడం, స్మార్ట్‌సిటీ పనులతో రూపురేఖలు మారడం, ప్రశాంత నగరంగా రికార్డులెక్కడం.. ఇలా అనేక కారణాలతో ప్రతి ఒక్కరూ నగర కేంద్రంగా నివాసముండేందుకు ఆసక్తి చూపడం కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే రియల్ రంగం పరుగులు పెడుతున్నది. ప్రధానంగా హైదరాబాద్ తర్వాత ఇక్కడే జోరుగా సాగుతున్నది. నగరం చుట్టూ ఎటు చూసినా.. ఇండ్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు, వెంచర్లతో హవా కనిపిస్తున్నది.
కార్పొరేషన్, ఫిబ్రవరి 7 : స్మార్ట్‌సిటీ కరీంనగరం సకల వసతులతో అభివృద్ధి చెందుతున్నది. తెలంగాణలోనే రెండో నగరంగా దూసుకెళ్తున్నది. ఈజీ లీవింగ్ నగరాల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానం, దక్షిణ భారత దేశంలో మూడో స్థానం సాధించింది. రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనతో ప్రజానీకం ఏ ఇబ్బంది లేకుండా నివసిస్తున్నది. విద్య, వైద్య రంగాల్లో ఊహించని ప్రగతి సాధించగా, కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల ఏర్పాటుతో ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది. నగరాన్ని ఆనుకొని ఇంజినీరింగ్ కాలేజీలు ఉండగా, మరోవైపు రెండు ప్రైవేట్ మెడికల్ కళాశాలకు తోడు ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటైంది.
ఇలా అన్నింటా సిటీ ముందంజలో ఉండగా.. ప్రతి ఒక్కరూ కరీంనగర్‌వైపు చూస్తున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పూర్వ జిల్లా నాలుగు జిల్లాలుగా విడిపోయినా.. ప్రజలు మాత్రం ఎకువగా నగరంలోనే నివాసం ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలతోపాటు ఇతర జిల్లాల ప్రజలు కూడా ఇకడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాంతంలో భూములు, ఇండ్లు కొనేందుకు ముందుకు వస్తున్నారు. రోడ్లు బాగుండడం, ప్రశాంత వాతావరణం ఉండడంతో శివారు ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
కరీంనగర్ సిటీ రోజురోజుకూ విస్తరిస్తున్నది. హైదరాబాద్ తర్వాత అభివృద్ధిలో దూసుకెళ్తుండడంతో రియల్ హవా నడుస్తున్నది. జిల్లా కేంద్రంగా ప్రముఖ సంస్థలతోపాటు బిల్డర్లు తమ వెంచర్లు, నిర్మాణాలు చేపడుతుండడంతో వ్యాపారం ఊపందుకుంటున్నది. దీంతో సిటీ నలువైపులా విస్తరిస్తున్నది. కరీంనగర్‌కు వచ్చే ఏ దారిలో చూసినా భారీ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు, ఇండిపెండెంట్ ఇండ్లు, వెంచర్లు కనిపిస్తున్నాయి. నగరం విస్తరిస్తుండడం, రోడ్లు అభివృద్ధి చెందడం, ఏ శివారు నుంచైనా నిమిషాల వ్యవధిలోనే నగరం నడ్డిబొడ్డుకు చేరుకునే అవకాశాలు పెరుగడంతో ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. ప్రశాంత వాతావరణంలోనే తమ స్థిర నివాసం ఉండాలన్న ఆలోచనతో నగరానికి కొంచం దూరంలో ఉన్నా కొనుగోలు చేస్తున్నారు. ఫాం హౌస్‌లు కూడా నిర్మించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రజల అభిరుచికి అనుగుణంగా బిల్డర్స్, రియల్ సంస్థల ప్రతినిధులు కూడా సకల సౌకర్యాలతో నిర్మాణాలు చేపడుతున్నారు.
అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణాల్లో కల్పించే సౌకర్యాలపై ప్రజలు ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. ఒకప్పుడు వాస్తు, నాణ్యత, సుందరంగా భవనం వరకే పరిమితమైనా.. నేడు ఆధునిక హంగులపై ఆసక్తి చూపుతున్నారు. ఇంటి నిర్మాణంతోపాటు ఆయా కాలనీల్లో కల్పించే మౌలిక సదుపాయాలపైనా ఫోకస్ చేస్తున్నారు. దీంతో ఆయా రియల్ వ్యాపార సంస్థల ప్రతినిధులు, బిల్డర్లు మెరుగైన సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నారు. ముఖ్యంగా ప్రతి వెంచర్‌లోనూ విశాలమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, విద్యుద్దీపాలతోపాటు భద్రత కోసం సీసీ కెమెరాలు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు, పార్కింగ్ స్థలం ఇలా ఎన్నో వసతులు కల్పిస్తున్నారు. ఇంటి నిర్మాణాల్లో చూస్తే ఆకట్టుకునేలా నిర్మాణం, మంచి ఫ్లోరింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ ఇలా అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నారు. కొన్ని ఇండ్లల్లో స్విమ్మింగ్ పూల్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని ఏర్పాటు చేసి ఇస్తున్నారు. డూప్లెక్స్ ఇండ్లల్లో హైడ్రాలిక్ లిఫ్టింగ్, అలెక్స్, ఆధునిక లాకింగ్ వ్యవస్థలను కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
ముఖ్యంగా కరీంనగర్ రాష్ట్రంలోనే ఒక గొప్పనగరంగా ఎదుగుతున్నది. ఇక్కడి ప్రజలు మెట్రోపాలిటన్ సిటీల్లోని సదుపాయాలు కోరుకుంటున్నారు. మేం కూడా మా సంస్థ నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో ప్రజల అభిరుచులకు అనుగుణంగా సదుపాయాలు కల్పిస్తున్నాం. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణాలు చేపడుతున్నాం.
– ఉప్పులూరి కృష్ణమూర్తి, ఎడ్వెన్సా సెంచరీ ఈపీసీ ప్రైవేట్ లిమిటెడ్
ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే కట్టె ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి ప్రత్యామ్నాయంగా యూపీవీసీ వినియోగం పెరిగింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా విస్తృత శ్రేణి గ్లేజింగ్ అందుబాటులో ఉన్నాయి. కొత్త భవనాలతోపాటు పాత ఇండ్ల పునరుద్ధరణలో యూపీవీసీ ఉత్పత్తులను వినియోగించవచ్చు. కొనుగోలుదారులు ముందుగా చెబితే ఎలా కావాలో అలా ఉత్పత్తులను అందిస్తాం.
– పీ మహేందర్, వేకా యూపీవీసీ స్మార్ట్ విండోస్ సొల్యూషన్స్
నగరంలోనే మొట్టమొదటిసారిగా మెట్రో పాలిటన్ సిటీల్లో అత్యాధునిక ప్రమాణాలతో విల్లాలను అందిస్తున్నాం. మేం మల్కాపూర్‌లో నిర్మించిన విల్లాలను ఈ ఏప్రిల్ నుంచి అందుబాటులోకి తెస్తున్నాం. ప్రజల ఇష్టాలకు అనుగుణంగా స్విమ్మింగ్ పూల్, క్లబ్, జిమ్, గార్డెన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. వీటితోపాటు అన్ని అనుమతులతో కూడిన వెంచర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం.
-రాయ్‌చందని సింధ్ డెవలపర్స్, మేనేజింగ్ డైరెక్టర్లు దిలీప్‌కుమార్ మోట్వాని, రాజు మోట్వాని
సోలార్ పవర్ ప్రజలకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పర్యావరణహితమైన సోలార్ వినియోగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. రాయితీలు ఇస్తూ వినియోగాన్ని పెంచాలని చేయాలని కోరుతున్నాయి. దీంతో ప్రజలు కూడా పర్యావరణ హితమైన సోలార్ వాహనాలవైపు ఆసక్తి చూపుతున్నారు.
– కోడూరి పర్శరాం గౌడ్, కేకే ఎంటర్ప్రైజెస్ సోలార్ సొల్యూషన్స్
పెట్రోల్, డీజిల్, బొగ్గు వల్ల పొల్యూషన్ పెరుగుతున్నది. అందుకే పర్యావరణ హితమైన విద్యుత్‌వైపు ప్రపంచం చూస్తున్నది. అందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాయి. రాయితీలు ఇస్తున్నాయి. ప్రస్తుతం సోలార్ బిగింపు కూడా సులువుగానే ఉన్నది. ప్రజలు ఇప్పుడిప్పుడే సోలార్‌వైపు ఆసక్తి చూపుతున్నారు. ఇంకా ముందుకు రావాల్సి ఉన్నది.
– ప్రశాంత్, సోని సోలార్ పవర్
నగరంతోపాటు శివారు ప్రాంతాల్లోనూ గృహ నిర్మాణాల ప్లాట్లకు మంచి డిమాండ్ ఉన్నది. ప్రభుత్వ నిబంధనలతో ఉన్న ప్లాట్స్ విషయంలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. నగర శివారులో నివాస గృహాలు తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు.
-సాద్ ఉస్మాని, సివిల్ ఇంజినీర్, ఉస్మాని అసోసియేట్స్, కన్స్ట్రక్షన్