Seed mills | హుజూరాబాద్, జూన్ 15: ప్రభుత్వం నిర్లక్ష్యం సీడ్ మిల్లు వ్యాపారులకు వరంగా మారిందని చెప్పవచ్చు. వరి ధాన్యం బోనస్ విషయం సీడ్ మిల్లు వ్యాపారులకు రెట్టింపు లాభాలను తెచ్చి పెడుతోంది. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోతే అన్నదాతలకు సీడ్ మిల్లు వ్యాపారులు మొండిచేయి చూపి కోట్లరూపాయలు వెనుకేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బోనస్ బూచి చూపి మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టే చందంగా సీడ్ వ్యాపారులు వ్యవరిస్తూ దోచుకునే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బోనస్ ధరతో కలిపి విత్తనాల విక్రయిస్తూ రైతులకు మాత్రం ఎగ్గొంటేందుకు పన్నాగాలు రూపొందిస్తున్నారు.
బోనస్ ధరతో కలిపి విత్తనాల విక్రయం
హుజూరాబాద్ ప్రాంతం సీడ్ మిల్లుకు పెట్టింది పేరు. ఇక్కడ పండిన వరి ధాన్యం విత్తనాలు ఎంతో మేలుగా ఉంటాయి. యాసంగిలో సాగు చేసిన వరిపంటలో సగానికిపైగా సీడ్ మిల్లు వ్యాపారులు విత్తనాల కోసం రైతుల దగ్గర వరి ధాన్యం సేకరిస్తారు. అయితే ప్రభుత్వం యాసంగీలో సాగు చేసిన సన్నాలకు కూడా రూ.500 ప్రకటించింది. దీంతో సీడ్ మిల్లుల వ్యాపారులు కూడా బోనస్ కలిపి ఇస్తామని చెప్పి రైతుల దగ్గరినుంచి ధాన్యాన్ని సేకరించారు. ఈ మేరకు సీడ్ మిల్లు వ్యాపారులు బోనస్ తో కలిపి విత్తనాల ధర నిర్ణయించి విక్రయం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం బోనస్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవరిస్తుండడంతో రైతులకు ధర విషయంలో వ్యాపారులు కొరివి పెడుతున్నారు. విత్తనాల విషయంలో బోనస్‌తో కలిపి ధర నిర్ణయించి క్రయవిక్రయాలు చేస్తూ డబుల్ బోనస్ పొందుతుండగా రైతులకు మాత్రం మొండి చేయిచూపే ప్రయత్నం చేస్తున్నారు.
పాత ధరతో పోల్చుకుంటే రూ.150 అదనం
ఇక్కడి పండిన వరిధాన్యం విత్తనాలకు క్వాలిటీ పరంగా ఇతర రాష్ట్రాల్లో చాలా డిమాండ్ ఉంది. శుద్ధి చేసిన సన్న దాన్యాన్ని 25కిలోల చొప్పున బ్యాగులో నింపుతారు. అట్టి విత్తనాల సంచికి కొంత లాభం చూసుకొని వ్యాపారులు ధర నిర్ణయించి విక్రయిస్తారు. అయితే ఈ యేడు సీడ్మిల్ యజమానులు 25కిలోల విత్తన సంచికి బోనస్ రూ.1449 ధర నిర్ణయించారు. ఈ మేరకు ఇతర రాష్ట్రాల్లో ఫర్టిలైజర్ అండ్ సీడ్ దుకాణాల వ్యాపారులు కొంచెం అటుఇటుగా ఇదే ధరకు విక్రయిస్తుండగా ఇక్కడి మార్కెట్లో రూ.1050నుంచి రూ.1100 వరకు ఫర్టిలైజర్ అండ్ సీడ్ దుకాణాలల్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
ఇదీ పాత ధరతో పోల్చుకుంటే రూ.150 అదనం. సన్నరకం విత్తనాలు 25కిలోల సంచికి గత యాసంగిలో రూ.900నుంచి రూ.950వరకు లభ్యమయ్యాయి. 25కిలోల విత్తన సంచి రూ. 1249 ధర ముద్రించి సీడ్ వ్యాపారులు విక్రయించారు. దీన్ని బట్టి చూస్తే సీడ్ మిల్లు వ్యాపారులు ఏ మేరకు దోచుకుంటున్నారో అర్ధమవుతుంది. క్వింటాల్ వరి దాన్యానికి ప్రభుత్వ మద్దతు ధర రూ.2330 ఉండగా రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్‌తో కలుపుకుని మొత్తంగా క్వింటాళుకు. రూ.2830 ఇస్తుంది
వ్యాపారులది తలో మాట..
ఇక్కడి విత్తనాలకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. రైతుల దగ్గరినుంచి సేకరించిన దాన్యానికి ధర చెల్లించే విషయంలో సీడ్ మిల్లు వ్యాపారులు తలోమాట అంటున్నట్లు తెలిసింది. సీడ్ మిల్లు వ్యాపారులు ఇప్పటివరకు ఒక్కరూపాయికూడా రైతులకు చెల్లించలేదు. అత్యవసరం ఉన్న రైతులకు రేపోమాపో చెల్లించడానికి సిద్దమవుతుండగా క్వింటల్ కు రూ.2500 అని కొందరు వ్యాపారులు, మద్దతు ధర మాత్రమే రైతులకు కట్టివ్వాలని ఏజంట్లకు వ్యాపారులు చెప్పినట్లు తెలిసింది. మొదట మాట ఇచ్చిన ప్రకారంగా బోనస్ ధరతో రైతులకు చెల్లిస్తే తమకు సంబందం లేదని వ్యాపారులు ఏజంట్లతో అన్నట్లు తెలిసింది. ఒకరిద్దరి రైతులకు క్వింటాళుకు రూ.2500 ధర చొప్పున డబ్బులు చెల్లించినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఇట్టి ధర చెల్లిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ తాత్సర్యంతో రైతులకు తీరని నష్టం
బోనస్ కలిపి విత్తనాలను వ్యాపారులు విక్రయిస్తుండగా రైతులకు మాత్రం అట్టి ధర చెల్లించడానికి చేతులు రావడంలేదు. ఎందుకంటే సన్నరకం దాన్యానికి బోనస్ చెల్లించడంలో ప్రభుత్వం తాత్సర్యం చేస్తుండటమే కారణమని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బోనస్ త్వరగా ఇవ్వకుంటే రైతులకు తీరని నష్టం జరిగే అవకాశాలుండగా వ్యాపారులకు కోట్లలో డబ్బులు మూటకట్టుకుంటారని రైతులు చెబుతున్నారు. బోనస్ తో కలిపి విత్తనాలను వ్యాపారులు విక్రయిస్తూ తమకు ముందు అనుకున్న ప్రకారంగా ధర ఎందుకు కట్టివ్వరని రైతులు ప్రశ్నిస్తున్నారు. పాత ధరతో పోల్చుకుంటే 25కిలోల సంచికి రూ.150 అదనంగా వస్తుండగా మొత్తంగా క్వింటాల్ కు రూ.600 సీడ్ మిల్లు వ్యాపారులకు లాభం చేకూరుతుంది. తన్నిపడేసినా పడేసి తన్నినా రైతులకే నష్టం తప్ప వ్యాపారులకు పోయేదేమి లేదని ఈ లెక్కలకు బట్టి చూస్తే తెలుస్తుంది
బోనస్ కలిపి చెల్లించాలని కోరుతున్న రైతన్నలు
రాష్ట్రంలోనే హుజూరాబాద్ ప్రాంతంలో సీడ్ మిల్లులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి నుంచి దేశంలో నలుమూలల చిత్తనాలు ఎగుమతి అవుతాయి. ముందు అనుకున్న ప్రకారం సీడ్ మిల్లు వ్యాపారులు ప్రభుత్వ మద్దతు ధరకు బోనస్ కలిపి దాన్యానికి డబ్బులు చెల్లించాలని రైతులు పేర్కొంటున్నారు. ఎందుకంటే విత్తనాలను బోనస్ కలిపి విక్రయిస్తూ తమకు మాత్రం ఎందుకు మొండి చేయి చూపితే ఊరకునేది లేదని హెచ్చరిస్తున్నారు. కలెక్టర్ జోక్యం చేసుకొని వ్యాపారుల దగ్గరినుంచి బోనస్‌తో కలిపి డబ్బులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.