మల్యాల/ కొడిమ్యాల, మే 19 : సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని మరిచిపోయాడని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. రేవంత్ పాలనలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందక రాష్ట్రం అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై త్వరలో సదస్సు నిర్వహించి నిజాలను ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలోని బృందావన్ రిసార్ట్ వేదికగా కాంగ్రెస్, బీజేపీ నుంచి కొండాపూర్‌కు చెందిన కందుల రమణారెడ్డి, గోపాల్రావుపేట గ్రామానికి చెందిన ఏడెల్లి పరశురాములుతోపాటు పలువురు యువకులు సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయస్వామిని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం వినోద్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బూతులు మాట్లాడే వారిలో సీఎం రేవంత్‌రెడ్డి దేశంలోనే ముందున్నారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. స్థానిక ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే సత్యం కొండగట్టు అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో కల్లాల్లో ధాన్యం తడుస్తుంటే పట్టించుకునే నాదుడే కరువయ్యాడని, రైతుల సన్న వడ్లకు బోనస్ లేదని, రైతు బంధు రావడం లేదని, రుణమాఫీ కాలేదని తెలిపారు.
గతంలో ఆంజనేయస్వామి ఆలయానికి 5.30 ఎకరాలు మాత్రమే ఉండేదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాము 333 ఎకరాల రెవెన్యూ భూమిని దేవాదాయశాఖకు బదిలీ చేసి విస్తరించినట్టు వినోద్‌కుమార్ తెలిపారు. ఆలయాల అభివృద్ధి విషయంలో ప్రత్యేక కృషి చేశామని, ప్రస్తుతం పదవిలో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ అన్నింటికంటే శక్తివంతమైన, పురాతమైనది కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయమని, ఎంతోమందిని దీక్షాపరులుగా ఆకర్షించే శక్తి ఆంజనేయస్వామికే ఉన్నదని చెప్పారు. ఏటా రెండు జయంతులను నిర్వహించే ఏకైక ఆలయం కొండగట్టు అని, ఎంతోమంది నియమ నిష్ఠలతో దీక్షను కొనసాగిస్తూ దూరాన్ని సైతం లెక్కచేయకుండా కాలినడకన ఆలయానికి వస్తున్నారని తెలిపారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించే బాధ్యత ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని చెప్పారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ మహిమాన్విత ఆలయ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక కృషి చేసి 1000 కోట్లు ప్రకటించి, తదనుగుణంగా 500 కోట్లకు ప్రణాళికలను సైతం రూపొందించామన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రతిపాదనలను అమలు పరచడం లేదన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ మాజీ చైర్పర్సన్లు తుల ఉమ, దావ వసంత, మాజీ జడ్పీటీసీలు రాంమోహన్‌రావు, ప్రశాంతి, బీఆర్ఎస్ నాయకులు వీర్ల వెంకటేశ్వర్రావు, పునుగోటి కృష్ఱారావు, పులి వెంకటేశంగౌడ్, గాడిచర్ల శ్రీకాంత్‌రెడ్డి, బద్దం తిరుపతిరెడ్డి, జనగం శ్రీనివాస్, నరేంధర్‌రెడ్డి, ఉప్పుల గంగయ్య, బాలగౌడ్, మధుసూదన్‌రావు, సాగర్‌రావు, అశోక్, లింగాగౌడ్, కొండయ్య, చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అంజన్న ఆలయంలో సౌకర్యాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించాం. ఈ క్రమంలో కొండపైన నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వరదకాలువకు ఆనుకొని ప్రత్యేకంగా పంప్‌హౌస్ నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించాం. అక్కడి నుంచి సంతలోనిలొద్దిని ప్రత్యేక రిజార్వాయర్గా మార్చి కొండపైకి తీసుకువచ్చేందుకు పనులను ప్రారంభించాం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పంప్‌హౌస్ నిర్మాణానికి నిధులు కుదించడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ విషయమై అధికార యంత్రాంగం ఇంజినీరింగ్ బృంద సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యాం. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక కృషి చేసి నిధుల రద్దును రాష్ట్ర ప్రభుత్వం విరమించుకునేలా చేయాలి. పంప్‌హౌస్ నిర్మాణం యధావిధిగా చేపట్టేలా బాధ్యత వహించాలి.