పెద్దపల్లి, మే 28 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి కలెక్టరేట్ పక్కన కంపు కొడుతున్నది. సమీపంలో ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లులు వదిలే వ్యర్థాలతో దుర్వాసన వస్తున్నది. జిల్లా ఉన్నతాధికారులు నిత్యం అదే రోడ్డు పక్క నుంచే ప్రయాణిస్తున్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. వ్యర్థాలతో పక్కనే ఉన్న బృందావన్‌కాలనీ వాసులు నిత్యం అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనికి తోడు పెద్దపల్లి-కరీంనగర్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న రైస్ మిల్లుల నుంచి వచ్చే వ్యర్థాలు, మురుగు నీటిని రోడ్డుపక్కన ఉన్న చిన్న కుంటలోకి వదులుతుండడంతో ప్రయాణికులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
రైస్ మిల్లులు వదిలే వ్యర్థాల వల్ల నిత్యం ముక్కు మూసుకొనే ఉండాల్సి వస్తున్నది. చిన్నగా గాలి వస్తే వాసనతో ఇండ్లల్లో ఉండలేక పోతున్నాం. కాలనీలో ప్రజలు నిత్యం అనారోగ్యం పాలవుతున్నారు. మున్సిపల్ అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోవడం లేదు. కలెక్టరేట్‌కు పక్కనే ఇంత కంపు కొడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు ఈ విషయంలో చొరవ చూపి దుర్వాసనను దూరం చేయాలి.