జమ్మికుంట, అక్టోబర్ 14: ‘మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించండి.. అసెంబ్లీకి పంపండి. నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటా. కోట్లాది రూపాయల నిధులు తెస్తా. మాట తప్ప.. మడమ తిప్ప. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. మూడోసారి కేసీఆరే సీఎం. ప్రతి కార్యకర్త ఎక్కడికక్కడే కలిసికట్టుగా ప్రచారం చేయాలి. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని చర్చించండి. ఈ సారి హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేద్దాం. మాయగాళ్ల మాటలు నమ్మోద్దు. మరోసారి మోసపోవద్దు. పనిచేయని నాయకుడికి తగిన గుణపాఠం చెబుదాం..’ అని బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన జమ్మికుంట మండలంలోని కోరపల్లి, వెంకటేశ్వర్లపల్లి, బిజిగిరిషరీఫ్, నాగంపేట, శాయంపేట గ్రామాల్లో పర్యటించారు.
ఆయా గ్రామాధ్యక్షులు, సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మండలంలోని ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని తెలిపారు. గత ఎన్నికల్లో సానుభూతితో గెలిచిన ఈటల ఇప్పటి వరకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. తట్టెడు మైట్టెనా పోసిండా..? చెప్పాలన్నారు. అసలు ప్రజలంటేనే పట్టింపుల్లేని నాయకత్వం మనకు అవసరమా..? చెప్పాలన్నారు. పనిచేసేదెవరో.. ప్రజల మధ్య తిరిగేదెవరో.. చర్చించాలని కోరారు. సంవత్సరన్నర కాలంగా మీ మధ్యలో తిరుగుతున్నానని.. ప్రజా సమస్యలు తన సమస్యలుగా చూస్తూ పరిష్కరిస్తున్నానని తెలిపారు. ఓట్ల కోసమే వచ్చే నాయకులను నమ్మవద్దన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం గొప్పదని, ఎక్కడికక్కడే ప్రతి కార్యకర్త ఒక నాయకుడిగా మారాలని పిలుపునిచ్చారు.
పర్యటనలో భాగంగా మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి ఆయా గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను కలిశారు. మృతికి కారణాలు అడిగి తెలుసుకొని, పరామర్శించారు. కాగా, పర్యటనలో ఆయనకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్నే గెలిపించుకుంటామని, భారీ మెజార్టీ అందిస్తామని ప్రతినబూనారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ మమత, జడ్పీటీసీ డాక్టర్ శ్రీరాం శ్యాం, కోరపల్లి, వెంకటేశ్వర్లపల్లి, బిజిగిరిషరీఫ్, నాగంపేట, శాయంపేట సర్పంచులు, ఎంపీటీసీలు గిరవేన రమ, బోయిని కుమార్, రాచపెల్లి సదయ్య, చందుపట్ల స్వాతి, ఆకినపెల్లి సుజాత, మమత తదితరులు పాల్గొన్నారు.