CPI national leader Chadha | చిగురుమామిడి, అక్టోబర్ 10 : బీసీ రిజర్వేషన్ పై బీజేపీ ద్వంద వైఖరి అవలంబిస్తుండడంతో బడుగు బలహీన వర్గాల ప్రజలు వెనుకబడిపోతున్నారని, ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో కేంద్రం నుండి రావాల్సిన 3 వేల కోట్లకు పైగా నిధులు పూర్తిగా నిలిచిపోయాయని సిపిఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై చాడ మాట్లాడుతూ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సిద్ధమై ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ బీసీ రిజర్వేషన్లపై కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఉత్కంఠమైన పరిస్థితి నెలకొందన్నారు.
కోర్టు స్టే ఇవ్వడం వల్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయిందని అన్నారు. స్థానిక సంస్థల హక్కులు హరించబడుతున్నాయని, కేంద్రం 73, 74 వ రాజ్యాంగ సవరణ అమలు చేయాలని ఉన్నప్పటికీ ఎన్నికలు జరగకపోవడం మూలంగా మూడు వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేయలేక పోతుందన్నారు. కేంద్రం నిధులను నిలిపివేసిందన్నారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వ స్థానిక సంస్థలకు నిధులు అధికారాలు ఇస్తున్న తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని గతంలో అనేకసార్లు ప్రభుత్వాలకు సీపీఐ సూచించిందన్నారు. అయినప్పటికీ కేంద్రం ఒంటెద్దు పోకడ ప్రదర్శిస్తూ బీసీ రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం సిగ్గుచేటు అన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని సిపిఐ శ్రేణులకు చాడ పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు ప్రజాప్రతినిగా ఉన్న సమయంలోనే మండలం అభివృద్ధి జరిగిందని పేదలకు పక్కా ఇల్లు, సాగు, తాగునీరు, వరద కాలువ కోసం పోరాటాలు చేసిన ఘనత కమ్యూనిస్టులదే అన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు ప్రచార ఆర్బాటనే తప్ప అభివృద్ధి పనులపై దృష్టి సారించడం లేదని ఎద్దేవా చేశారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ కి పూర్వ వైభవం తీసుకురావాలని, అత్యధిక స్థానాలు గెలుపొంది సత్తా చాటాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల మధ్య ఉండి నిరంతరం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందే స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు భోయిని అశోక్, గూడెం లక్ష్మి, జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి, చిన్నస్వామి,తేరాల సత్యనారాయణ, సహాయ కార్యదర్శి బూడిద సదాశివ, పైడిపల్లి వెంకటేష్, మండల మాజీ కార్యదర్శి ఎలగందుల రాజయ్య, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి గోలి బాపు రెడ్డి, నాయకులు పరకాల కొండయ్య, రాజు, అంజవ్వ, ఎల్లయ్య, జంపయ్య, మల్లయ్య తదితరులున్నారు.