బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేపర్ లీకేజీ కుట్రలపై సకలజనం భగ్గుమన్నది. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు నీచరాజకీయాలకు దిగడంపై ఆగ్రహించింది. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు దిగింది. బండి దిష్టిబొమ్మలతో శవయాత్ర చేసి, దహనం చేసింది. సంజయ్‌తోపాటు బీజేపీకి వ్యతిరేకంగా నినదించింది. స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదని హితవుపలికింది. ఒక ఎంపీగా ఉండి బాధ్యతారహితంగా వ్యవహరించిన ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. మరోవైపు పలుచోట్ల పదో తరగతి విద్యార్థులు ఠాణా మెట్లెక్కారు. సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇంకోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక ఎంపీగా పదో తరగతి ప్రశ్నాపత్రాలను వైరల్ చేయడం ఏంటని ప్రశ్నించారు. దీనికి కచ్చితంగా గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
చొప్పదండి/ గంగాధర, ఏప్రిల్ 5 :బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై సకల జనం కన్నెర్ర జేసింది. పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ చేయించడంపై మండిపడింది. బుధవారం విద్యార్థుల తల్లిదండ్రులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేశారు. బండి సంజయ్ దిష్టిబొమ్మలు దహ నం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని తెలంగాణ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు అజయ్ కుమార్ గౌడ్, నాయకులు కలిసి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్- జగిత్యాల ప్రధాన రోడ్డుపై బండి దిష్టిబొమ్మను మండల బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు.
పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో నగర డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు కలిసి బండి దిష్టిబొమ్మను దహనం చేశారు. యైటింక్లయిన్‌కాలనీలోని డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో యూనియన్ కార్యాలయం ఎదుట బండి దిష్టిబొమ్మను దహనం చేసి, వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంథనిలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంపీపీ కొండ శంకర్, జడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎగోలపు శంకర్‌గౌడ్ కలిసి ప్రధాని మోదీ, ఎంపీ బండి సంజయ్ దిష్టి బొమ్మలను దహనం చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తాలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు కలిసి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ధర్మపురి పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ప్రధాని మోదీ, బండి సంజయ్ దిష్టిబొమ్మలను మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, జడ్పీటీసీ బత్తిని అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్ కలిసి దహనం చేశారు. కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌక్ జాతీయ రహదారిపై సంజయ్ దిష్టిబొమ్మను ఎంపీపీ తోట నారాయణ, సర్పంచ్ల ఫోరంగౌరవాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్‌తో కలిసి బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు.
జగిత్యాల రూరల్, ఏప్రిల్ 5: బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్రలు చేస్తున్నాడని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఒక ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి చిల్లర చేష్టలు చేస్తున్న సంజయ్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పదో తరగతి ప్రశ్నపత్రాలను లీకేజీ చేయిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని ఆయనపై విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ తమ రాజకీయ లబ్ధి కోసం బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్‌ను అప్రతిష్ట పాలు చేసేందుకు అనేక కుట్రలు చేస్తున్నదని మండిడ్డారు. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో సంబంధం ఉన్న రాజశేఖర్ రెడ్డి బీజేపీ నాయకుడన్నారు. తాజాగా ఆ పార్టీ నాయకుడు ప్రశాంత్ బండి సంజయ్‌కు ప్రశ్నా పత్రం లీకేజీపై మెస్సేజ్ పంపాడని మీడియా ద్వారా బట్టబయలైందన్నారు. ఈ సంఘటనతో విద్యార్థుల్లో అభద్రతా భావం పెరుగుతుందని, ఇది సరైంది కాదన్నారు. తాండూర్, కమలాపూర్‌లో ప్రశ్న పత్రాల లీకేజీ పథకం ప్రకారమే జరిగిందని చెప్పారు. అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలో తహసీల్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక్కడ ఇన్చార్జి మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆసిఫ్, కల్లెడ పీఎసీఎస్ చైర్మన్ సందీప్ రావు, కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు, పంబాల రాము, కూతురు రాజేష్, నాయకులు ఆనంద రావు, వొల్లెం మల్లేశం, బాలె శంకర్, దుమాల రాజ్ కుమార్, రంగు మహేశ్, క్రాంతి, నరేష్, ఆరీఫ్, ముఖేష్ ఖన్నా, కూతురు శేఖర్ ఉన్నారు
రాజకీయ లబ్ధి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిల్లర రాజకీయాలు చేస్తూ విద్యార్థులు, యువకులను బలిపశువులను చేస్తున్నాడు. ఎస్సెస్సీ పేపర్ లీకేజీ వెనుక బండి సంజయ్ హస్తం ఉంది. పేపర్ లీకేజీలో ప్రధాన సూత్రధారిగా ఉన్న ప్రశాంత్ బండి సంజయ్ అనుచరుడే. విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలో సంజయ్ అనుచరుడే పేపర్‌ను వాట్సాప్‌లో లీక్ చేసి, ప్రభుత్వమే లీక్ చేసిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. లీకైన ప్రశ్నాపత్రం బీజేపీ వాట్సాప్ గ్రూపుల్లోనే ఎందుకు షేర్ అయింది. రాష్ట్రంలో రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని ప్రోత్సహిస్తూ ఉత్తరప్రదేశ్, బీహార్ సంస్కృతిని రాష్ట్రంపై రుద్దేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడానికి బీజేపీ కుటిల రాజకీయం చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నన్ని రోజులు బీజేపీ ఎత్తుగడలు సాగవు. పేపర్ లీకేజీ వెనుక ఉన్న నిందితులను కఠినంగా శిక్షించాలి.
-్ర పెస్నోట్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ (గంగాధర)
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్
హుజూరాబాద్‌టౌన్, ఏప్రిల్5: పరీక్ష పత్రాలు లీక్ చేస్తూ బండి సంజయ్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నిప్పులు చెరిగారు. బీజేపీ నేతలు తమ స్వార్థం కోసం నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే సహించబోమని హెచ్చరించారు. ఎన్నికల వేళ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆ పార్టీ దుర్మార్గపు ఎత్తుగడలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం హుజూరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. లీకేజీ వ్యవహారంలో పాలుపంచుకున్న వారందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమాయకుల జీవితాలతో ఆటాడుకుంటున్న బీజేపీ నాయకులను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఎస్సెస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై వరంగల్ సీపీ రంగనాథ్ పూర్తి ఆధారాలు, వివరాలతో బీజేపీ, బండి కుట్రలను బయటపెట్టారని గుర్తు చేశారు. నిరుద్యోగులు, విద్యార్థులను తప్పుదోవపట్టిస్తున్న బీజేపీ తీరుపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
పేపర్ల లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి. రాజకీయంగా బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను ఎదుర్కొలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నడు. ఆ పార్టీ ఢిల్లీ పెద్దల డైరెక్షన్లో రాష్ట్రంలో అశాంతి, అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నడు. 10వ తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్‌లో పెట్టిన ప్రశాంత్‌ది బీజేపీ సోషల్ మీడియా విభాగంలో కీలక పాత్ర. ఇక్కడి అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నడు. తెలంగాణకు పెట్టుబడులు వస్తే బీజేపీ నేతలకు కండ్లు మండుతున్నయ్. తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తగిన సమయంలో బుద్ధి చెబుతది.
– కోరుకంటి చందర్, రామగుండం ఎమ్మెల్యే