కార్పొరేషన్, ఫిబ్రవరి 11: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అజ్ఞాని. ఆయనకు ఏం తెలియదు. తెలిసిందల్లా సంపుడు, నరుకుడు, పడగొట్టుడు, సమాధులు తవ్వుడు తప్ప మరో భాష రాదు. ఇటీవలి కాలంలో నీచంగా నికృష్టంగా వ్యవహరిస్తున్నడు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నడు’ అంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొత్త సెక్రెటేరియెట్పై డోమ్‌లు నిర్మిస్తుంటే కూల్చేస్తా అంటడా..? ఎంత ధైర్యం అని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తారక హోటల్లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న తెలంగాణ సెక్రటేరియట్‌పై గుమ్మటాలతో(డోమ్‌లు) నిర్మిస్తుంటే దాని గురించి ఏమీ తెలియకుండానే సెక్రటేరియట్‌ని కూల్చేస్తా అనడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మండిపడ్డారు. సంజయ్ మాటలు విని కరీంనగర్ ప్రజలు సిగ్గుపడుతున్నారని, ఇతన్నా తాము ఎంపీగా గెలిపించుకున్నదని ఆవేదన చెందుతున్నారని చెప్పారు.
సంజయ్‌ది కన్స్ట్రక్టివ్ మైండ్ కాదు డిస్ట్రక్టివ్ మైండ్ అని విమర్శించారు. సెక్రటేరియేట్‌ను తాజ్‌మహల్‌తో పోల్చాడని, అది సమాధి అని మాట్లాడాడని, అసలు తాజ్‌మహల్ గురించి బండికి ఏం తెలుసో చెప్పాలని ప్రశ్నించారు. హిం దూ రాజులు పాలించిన ఉదయపూర్ ఖిల్లా పైన ఉన్న డోమ్‌లను స్ఫూర్తిగా తీసుకొనే షాజహాన్ తాజ్‌మహల్‌ను నిర్మించారని చెప్పారు. ఇంత రెచ్చిపోతున్న బండి సంజయ్‌ను తాము ఒక్కటే అడుగుతున్నామని, ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీపై కూడా డోమ్‌లు ఉన్నాయని, మరి మీ బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావును అందులోకి వెళ్లకుండా ఉండేందుకు రాజీనామా చేయిస్తారా అని సవాల్ చేశారు.
తెలంగాణ హైకోర్టుపైన డోమ్‌లు ఉన్నాయని, అలాగే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ ఒకప్పటి నిజాం ప్యాలెస్, ఇప్పుడు వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, అధికారులతో మోదీ సమావేశాలు నిర్వహిస్తున్నారని, దానిపై కూడా డోమ్‌లు ఉన్నాయని, దానిని కూడా కూల్చేస్తారా అని ప్ర శ్నించారు. సుప్రీంకోర్టు, న్యూఢిల్లీ అసెంబ్లీ, బీజేపీ పరిపాలించే గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీలపైనా డోమ్‌లు ఉన్నాయని, వాటిని కూడా పడగొడతారా..? లేదంటే అక్కడి ముఖ్యమంత్రులతో రాజీనామా చేయిస్తారా అని ప్రశ్నించారు. దేశంలోనే అతి శక్తివంతులైన హిందూ రా జులైన ఉదయపూర్, మైసూర్, జోద్పూర్, గ్వాలియర్ వంటి రాజవంశస్తులు పరిపాలించిన ప్యాలెస్‌లపై కూడా ఉన్నాయని, వాటిని హిందువులే కట్టారని గుర్తు చేశారు. బండి సంజయ్ ముం దుగా దేశంలో, రాష్ట్రంలోని కట్టడాలపై ఉన్న డోమ్ ల ప్రత్యేకత తెలుసుకోవాలని, అవసరమైతే తిరగడానికి అయ్యే ఖర్చులను తాను భరిస్తానని పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్లో రాష్ర్టానికి రూపాయి తేకుండా ఎక్కడ ప్రజలు నిలదీస్తారోనని కరీంనగర్ ప్రజలకు ముఖం చూపకుండా తప్పించుకు తిరుగుతున్న బండి, సెక్రటేరియట్ గురించి మా ట్లాడే అర్హతే లేదని స్పష్టం చేశారు. కరీంనగర్ ప్రజలు తలదించుకునేలా వ్యవహరిస్తున్న బండి సంజయ్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని, లేదేంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, మానకొండూర్ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్‌గౌడ్, సుడా సభ్యులు చీటీ రాజేందర్రావు, తోట మధు, బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కంది విజేందర్‌రెడ్డి, చంద్రశేఖర్ ఉన్నారు.