ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఆదివారం మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ‘ఓం నమ:శివాయ.. హర హర మహాదేవ.. శంభో శంకర’ నామస్మరణలతో శైవక్షేత్రాలు మారుమోగాయి. ఆదిలాబాద్‌లోని తిలక్ నగర్ శివాలయం, బోథ్‌లోని నిగిని అటవీ ప్రాంతంలోని కైలాష్ టెకిడి శివాలయం, కుంటాల సోమేశ్వరా, కెస్లాపూర్ నాగోబా ఆలయం, సిరిచెల్మ, కదిలి, గొడిసెర్యాల, బాసర సరస్వతి, తదితర శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి.

వేకువజాము నుంచే వాగులు, గోదావరి, ప్రాణహిత నదుల్లో పుణ్యస్నానాలు చేసి త్రినేత్రుడిని దర్శించుకున్నారు. రుద్రాభిషేకాలు, శివపార్వతుల కల్యాణం, లింగోద్భవ పూజలు కనుల పండువగా సాగాయి. ఉపవాస దీక్షలు చేపట్టి, రాత్రంతా జాగరణ చేశారు. పలుచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీలు అన్ని సౌకర్యాలు కల్పించాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.